Raghurama Krishnam Raju: మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పేర్కొంది. సాకులు చూపుతూ ప్రభావతి దర్యాప్తునకు రావట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదించారు. అయితే 2 నెలల్లో ఒక్కసారే పిలిచారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో ప్రభావతికి జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే, సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఒక్కసారే విచారణకు పిలిచారని, రెండు నెలల్లో మళ్ళీ పిలవలేదన్న ప్రభావతి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ‘ ఎప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారు. ఏదో ఒక సాకు చూపి దర్యాప్తునకు హాజరుకావడం లేదు’ అని కోర్టుకు ప్రభుత్వం తరఫున లాయర్ చెప్పారు.
Also Read: Sudharshan on Adulterated Goods: బిగ్ అలెర్ట్.. ఆ ఆహార పదార్థాలతో జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి!
విచారణకు వెళ్తే సరి..
ఈ సందర్భంగా విచారణకు ఎలా సహకరించడం లేదు? అనేదానిపై సాక్ష్యాలన్నీ లూథ్రా కోర్టుకు అందజేశారు. మధ్యే మార్గంగా చూసుకోవాలని ఇరువురికీ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సూచించింది. చివరికి ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరుకావాలని ప్రభావతిని ధర్మాసనం ఆదేశించింది. రెండ్రోజుల విచారణలో లిఖితపూర్వకంగా అన్ని సమాధానాలు తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర ఉపశమనం రద్దు అవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. అనంతరం తదుపరి విచారాణ ఈనెల 15కు ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, వైసీపీ హయాంలో కస్టోడీయల్ టార్చర్‌లో రఘురామకు ఎలాంటి గాయాలు లేవని ప్రభావతి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
సంజయ్‌కు నోటీసులు
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సంజయ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.