HCU Land Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం లాక్కోవడం లేదని, ఈ భూములకు బదులుగా గతంలోనే గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఈ భూముల చుట్టూ వివాదం ఆగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హెచ్‌సీయూ భూములను ఆయన బినామీలకు కట్టబెట్టారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ‘హెచ్‌సీయూ భూముల్లో మైహోం విహంగ భవనాలు నిర్మించారు, రోడ్లు వేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదు? కేసీఆర్ బినామీలకు భూములు ఇచ్చేప్పుడు వన్యప్రాణులు కనిపించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ప్రస్తుతం ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సూచనాత్మకంగా విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, వాటిని కాపాడాలని ముఖ్యమంత్రిని కోరతామని ఆయన తెలిపారు. ‘లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి’ అని హెచ్చరించారు.
Also read: హెచ్ సీయూ భూముల వివాదం.. కేంద్రం జోక్యం కోరిన బీజేపీ ఎంపీలు
హెచ్‌సీయూ కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 2500 ఎకరాల భూమిని కేటాయించారని, కానీ ఈ భూములు అన్యాక్రాంతమైనట్లు ఆయన ఆరోపించారు. 534 ఎకరాల హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం తీసుకున్నప్పుడు, గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయించినప్పటికీ, ఈ భూములపై రామేశ్వర రావు వంటి వ్యక్తుల కన్ను పడిందని, కోర్టు కేసు కారణంగా కొల్లగొట్టలేకపోయారని ఆయన వెల్లడించారు. “హెచ్‌సీయూ అన్యాక్రాంత భూముల్లో మైహోం భవనాలు వెలిశాయి. గతంలో దీనిపై ఎవరూ ప్రశ్నించలేదు” అని ఆయన విమర్శించారు.
చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనేలా.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను బీఆర్‌ఎస్ నాయకులే కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు, ఇతర పార్టీల నేతలు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read: హెచ్ సీయూ భూముల వివాదం.. కేంద్రం జోక్యం కోరిన బీజేపీ ఎంపీలు
ప్రభుత్వం హెచ్‌సీయూ భూములు తమ సొంతమని చెబుతున్నప్పటికీ, ఈ వివాదం ఆగడం లేదు. మహేశ్ గౌడ్ డిమాండ్ చేసిన సర్వే జరిగితే, గతంలో భూముల వినియోగంలో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.
యూనివర్సిటీ భూముల వ్యవహారంలోనే హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ బంద్‌కు సైతం పిలుపునిచ్చారు. అయితే హెచ్‌సీయూ భూముల సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు తరలి వస్తుండగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్ చేసి స్థానికి పోలీస్ స్టేషన్లకు తరలించారు.