Ameenpur Crime: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో పెరుగన్నం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, తల్లి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అంతేకాకుండా టార్గెట్ మరొకరు కాగా, గురి తప్పడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో పెరుగన్నం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, తల్లి రజిత వైద్యశాలను చికిత్స పొందుతోంది. పెరుగన్నం తినడం ఏమిటి? చిన్నారులు మృతి చెందడం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. వివాహేతర సంబంధం కారణంగా భర్త, తన పిల్లలను చంపేయాలని భార్య రజిత ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ కార్యక్రమం ద్వారా పార్టీలో తన స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో, ప్రియుడుతో కలిసి ఉండాలని రజిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గత నెల 27న రాత్రి భోజనం తినే సమయంలో పెరుగుల విషపదార్థం కలిపిన రజిత, పక్కా ప్లాన్ తో భర్త చెన్నయ్య, పిల్లలకు పెరుగన్నం పెట్టేందుకు సిద్ధమైంది.
అయితే భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో, ఆ అన్నాన్ని ఏకంగా తన ముగ్గురు పిల్లలకు రజిత తినిపించింది. ఉదయం చెన్నయ్య ఇంటికి రాగానే ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8) లు విగత జీవులుగా పడి ఉన్నట్లు గుర్తించి వైద్యశాలకు తరలించారు. అలాగే తనకు కూడా కడుపునొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో చెన్నయ్య ఆమెను వైద్యశాలకు తరలించారు.
Also Read: Telangana Cabinet: మంత్రివర్గ విస్తరణపై కథ మళ్లీ మొదటికొచ్చినట్లేనా?
పెరుగన్నం తిని ముగ్గురు చిన్నారులు, తల్లి రజిత అనారోగ్యానికి పాలవడంతో మొదటగా పోలీసులు భర్త చెన్నయ్య పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు పూర్తి విచారణ చేపట్టగా రజిత బాగోతం బయటపడింది. కన్నతల్లి నన్న విషయాన్ని మరిచి ముగ్గురు చిన్నారులకు పెరుగన్నం తినిపించి పొట్టన పెట్టుకున్న రజితను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలను వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద పోలీసుల ప్రకటనతో అసలు ఏం జరిగిందనే విషయం పూర్తిస్థాయిలో బయటకు రానుంది.