Smart Ration Cards AP: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మే నెల నుంచి ప్రారంభం కానుంది. క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త కార్డులతో పారదర్శకత, సాంకేతికతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అదే సమయంలో రైతుల సౌలభ్యం కోసం ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ వినూత్న చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌తో పాటు ఇతర ఆధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయితే ఎంత మందికి కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. దీని ద్వారా అర్హులైన వారికి మాత్రమే రేషన్ సౌలభ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త విధానంతో నకిలీ కార్డుల సమస్యను అరికట్టడంతో పాటు వ్యవస్థను సమర్థవంతంగా నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
మంగళవారం నుంచి దీపం-2 పథకం కింద రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని పేదలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని, రైతుల సౌలభ్యం కోసం వాట్సప్ ద్వారా ధాన్యం విక్రయించే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 16 వేల మంది రైతులు వాట్సప్ ద్వారా ధాన్యాన్ని విక్రయించారని తెలపారు. అలాగే, గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ వినూత్న పద్ధతులతో రైతులకు సాంకేతికత ఆధారిత సేవలను అందించడంలో ప్రభుత్వం విజయం సాధిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
Also Read: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!