AP CM on DSC Notification: ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఏపీలో పెన్షన్ల పంపిణీ జోరందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారికి పింఛన్లు అందజేశారు. అనంతరం స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై నిర్వహించిన సభలో పాల్గొని సీఎం మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనకు చెక్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీపై ఏమన్నారంటే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి సందర్భంగా సీఎం చంద్రబాబు తన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు. దీంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డీఎస్సీపై సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. జూన్ లో స్కూళ్లు రీఓపెన్ అయ్యే సమయానికి టీచర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు
అంతకుముందు పింఛన్ల పంపిణీ గురించిన మాట్లాడిన సీఎం చంద్రబాబు.. గత ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిన్నర కుటుంబాలలోని 64 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏడాదికి రూ. 33,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన చంద్రబాబు.. ఆయనపై సెటైర్లు వేశారు. ఒకప్పుడు ఆయన నొక్కిన బటన్లన్నీ ప్రస్తుతం ఇచ్చే ఫించన్లతో సమానమని అన్నారు.
Also Read: Akkada Ammayi Ikkada Abbayi Trailer: 60 మందికి ఒకే అమ్మాయి.. సమ్మర్‌కి హిలేరియస్ ఎంటర్‌టైనర్!
మేలో తల్లికి వందనం ప్రారంభం
2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు అప్పు వచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు తల్లికి వందన కార్యక్రమాన్ని మేలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కుటుంబంలో ఎందరు పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సంక్షేమం – అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ తమ ప్రభుత్వం ముందుకు పోతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.