Hyderabad Crime: మహిళలపై అఘాయిత్యాలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకూ దేశంలో ఏదోక మూల లైంగిక దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో గుడికి వెళ్లిన వివాహితపై గ్యాంగ్ రేప్ (Gang Rape) జరగ్గా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే తెలంగాణలో తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఓ విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది.
లిఫ్ట్ ఇస్తామని చెప్పి..
హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ (Pahadi Sharif PS) పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ యువతి వద్దకు కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆగారు. మీర్ మేట్ (Meepet) ఏరియాలోని మందమల్లమ్మ సెంటర్ (Manda Mallamma Center) వద్ద విదేశీ యువతికి లిఫ్ట్ ఇస్తామని ఆశ చూపారు. తొలుత ఆమె ఇందుకు తిరస్కరించిన తర్వాత వారితో వెళ్లేందుకు ఒప్పుకుంది.
నిర్మానుష్య ప్రాంతంలో
బాధితురాలు కారు ఎక్కిన తర్వాత ఆ ముగ్గురు ఉన్మాదులు తమ నిజస్వరూపాన్ని చూపించారు. కారును పహాడీషరీఫ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాధితురాలను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు.
రంగంలోకి పోలీసులు
తనపై జరిగిన దారుణం నుంచి తేరుకున్న జర్మనీ యువతి.. నేరుగా పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ముగ్గురు తనపై చేసిన అఘాయిత్యం గురించి పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు ఆ ఉన్మాదులపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ముగ్గురు మృగాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని ఉత్కంఠ.. కొలిక్కి వచ్చేనా?
గుడికెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్
మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలోని ఓ ఆలయానికి వెళ్లిన మహిళపై కొందరు గ్యాంగ్ రేప్ చేశారు. బంధువుతో కలిసి బాధితురాలు గుడికి వెళ్లగా.. దర్శనం అనంతరం ఓ చెట్టు కింద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆలయ తాత్కాలిక ఉద్యోగి మరో ఏడుగురితో కలిసి వచ్చి మహిళ పక్కన ఉన్న బంధువుతో తొలుత గొడవపడ్డారు. అనంతరం అతడ్ని చెట్టుకు కట్టేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.