నగరి, స్వేచ్ఛ: RK Roja on Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా శెల్వమణి మండిపడ్డారు. ‘ భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన? భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు’ అని రోజా ట్వీట్ చేశారు.
