తెలంగాణ బ్యూరో స్చేచ్ఛ: GHMC Property Tax: రాష్ట్రంలోనే సింహాభాగం జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రికార్డు స్థాయిలో జరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ.1917 కోట్లు వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సరం (2024-25)కి గాను సిటీలోని మొత్తం 17.5 లక్షల రెసిడెన్షియల్, మరో రెండు లక్షల కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపు దారు నుంచి రూ.2 వేల కోట్ల కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకుని, గత సంవత్సరం చేసిన రూ. 1917 కోట్లు దాటితే చాలని అధికారులు భావించారు.
కానీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కమిషనర్ ఇలంబర్తి రచించిన వ్యూహాం ఫలించి ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం సాయంత్రం ఆరు గంటల కల్లా రూ.2012 కోట్ల పై చిలుకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. కలెక్షన్ పై ఎప్పటికపుడు కమిషనర్ సూచనలు, సలహాలు ఫలించగా, అదనపు కమిషనర్ (రెవెన్యూ) అనురాగ్ జయంతి, జాయింట్ కమిషనర్ (రెవెన్యూ) మహేశ్ కులకర్ణిల పర్యవేక్షణ సత్పలితాలిచ్చాయని భావించవచ్చు. అధికారులు సైతం ఊహించని స్థాయిలో ఆస్తి పన్నురికార్డు స్థాయిలో వసూలైంది.
కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆస్తి పన్ను చెల్లించే బకాయిదారుల సంఖ్య పెరగటంతో పాటు అధికారుల అంచనాలను తారుమారు చేసే స్థాయిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకే రూ.2012 కోట్లు వసూలయ్యాయి. రాత్రి పన్నెండు గంటల వరకు ఆన్ లైన్ లో పన్ను చెల్లించే అవకాశాలున్నా, గంటకు రూ. కోటి చొప్పున ఆన్ లైన్ చెల్లించే అవకాశాలుండటంతో ఈ సారి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కనీవినీ ఎరగని రీతిలో రూ.2020 కోట్లకు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనాలేస్తున్నారు.
Also Read: RR vs CSK: ట్రాక్ తప్పిన సీఎస్కే.. సర్వత్రా విమర్శలు.. చెత్త రికార్డులు
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మొండి బకాయిల వసూళ్ల కోసం మార్చి 7న సర్కారు ఇచ్చిన ఓటీఎస్ ( వన్ టైమ్ సెటిల్ మెంట్) ద్వారా రూ. 465 కోట్ల పై చిలుకు వసూలయ్యాయి. ఓటీఎస్ ద్వారా అధికారులు మార్చి నెలాఖరు కల్లా సుమారు రూ.300 కోట్లు వరకు వసూలవుతాయని అధికారులు లెక్కలేశారు. కానీ వారి లెక్కలను దాటి ట్యాక్స్ కలెక్షన్ అయింది.
ప్రతి పదేళ్లకో అరుదైన రికార్డు
జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ప్రతి పదేళ్లకో అరుదైన రికార్డును సృష్టిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014లో అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్ పర్యవేక్షణలో ట్యాక్స్ కలెక్షన్ రూ. వెయ్యి కోట్ల మైలు రాయి దాటగా, సరిగ్గా పదేళ్ల తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రూ.2 వేల కోట్లు దాటించాలన్న కమిషనర్ ఇలంబర్తి ప్రణాళికలు ఫలించి, రికార్డు స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ అయింది. 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రూ.90 కోట్ల నుంచి రూ.వంద కోట్ల మధ్య ట్యాక్స్ కలెక్షన్ ను పెంచుకుంటూ జీహెచ్ఎంసీ నేడు రూ.2012 కోట్ల కలెక్షన్ కు చేరటంతో. రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించి రూ. 2200 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకోవాలని భావిస్తున్నారు.
ఈ రకమైన టార్గెట్ లెక్కలతో పాటు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో నిర్మాణ రంగం మరింత ఊపందుకుని, బహుళ అంతస్తు భవనాలు వేల సంఖ్యలో వచ్చే అవకాశాలుంటంతో నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకెళితే 2035 సంవత్సరం నాటికి ట్యాక్స్ కలెక్షన్ రూ.3 వేల కోట్లు దాటించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసినట్లు సమాచారం.
ముందస్తు చెల్లిస్తే 5 శాతం రాయితీ
కొత్త నూతన సంవత్సరం 2025-26 కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ను ఏప్రిల్ మాసం చివరి కల్లా చెల్లిస్తే, చెల్లిస్తున్న మొత్తం పన్నులో అయిదు శాతం రాయితీని ఇచ్చేందుకు నేటి నుంచి ఎర్లీ బర్డ్ స్కీంను అమలు చేయనున్నట్లు కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీం ఏప్రిల్ నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read: TG govt on HCU Land: హెచ్ సీయూ భూముల రగడ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన