తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Vanguard in TG: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనాలసిస్, మొబైల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాన్‌గార్డ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ రాష్ట్రంలో యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సోమవారం సమావేశమై హైదరాబాద్‌లో సేవలను అందించేందుకు ఈ ఏడాది చివరకు లాంఛనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
రానున్న నాలుగేండ్ల కాలంలో సుమారు 2,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో మొదటి యూనిట్‌ను నెలకొల్పడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ దాదాపు 50 మిలియన్లకుపైగా పెట్టుబడిదారులకు సేవలను అందిచనున్నట్లు సీఎంకు వివరించారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే ఈ యూనిట్ ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేయనున్నదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ తదితర సాంకేతిక రంగాల్లో అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: Fine Rice Scheme: సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మంత్రి కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను సీఈఓ సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐఓ (ఎండీ కూడా) నితిన్ టాండన్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ-వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ తదితరులు వివరించారు. హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణమున్నదని సీఈవో సలీం రాంజీ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో హైదరాబాద్‌ను అనువైన నగరంగా ఎంచుకున్నామన్నారు. వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు కల్పించటం సంతోషంగా ఉందన్నారు. వాన్‌గార్డ్ జీసీసీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఆనందంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందన్నారు. దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారాన్ని అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రతిరోజూ పండగే…!