నల్లగొండ బ్యూరో, హుజూర్‌నగర్, స్వేచ్ఛ: Fine Rice Scheme:పేదలందరికీ సన్నబియ్యం అందించాలనే స్కీమ్ అద్భుతమని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం స్కీమ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాల దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 85 శాతానికి పై చిలుకు నిరుపేదలందరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. యావత్ భారతదేశంలోనే ఈ తరహా ప్రయోగం చేపట్టడం తెలంగాణా రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తేల్చిచెప్పారు.
Also read: Cm Revanth Reddy: అభివృద్ధిలో ఉరకలేద్దాం.. దేశానికి ఆదర్శమవుదాం.. సీఎం రేవంత్ సెన్సేషన్ స్పీచ్
గతంలో రూ.10,665 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా సంకల్పం నెరవేరలేదన్నారు. పైగా దొడ్డు బియ్యం దారి తప్పి కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు చేరాయన్నారు. బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రంలో ఎటువంటి మార్పునకు ప్రయత్నించలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితిని లోతుగా అధ్యయనం చేసిన మీదట దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
తెల్ల రేషన్ కార్డుల మంజూరు విషయంలోనూ బీఆర్ఎస్ పాలకులు ఉదాసీనంగా వ్యహరించారని విమర్శించారు. కేవలం ఉప ఎన్నికల సమయంలో మాత్రమే బీఆర్ఎస్ పాలకులకు తెల్ల రేషన్ కార్డులు గుర్తుకు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు నిర్ణయం తీసుకుందని, 30 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 2.85 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, తాజాగా వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరనుందన్నారు. ఉచితంగా సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం అంటే 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందన్నారు.
హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలని, అందుకు ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు చిందించిన స్వేదం, వారి త్యాగాల ఫలితమేనన్నారు. అందుకే లోకసభ ఎన్నికలలో ఒకే ఒక నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ దాటించి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిన చరిత్ర వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఉందని స్పష్టం చేశారు.