Vizag: వైజాగ్ నగరంలో సంచలనం సృష్టించిన బ్యాంక్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ బంగారం ఇచ్చి కస్టమర్లను మోసం చేసిన ఘటనలో రూపిక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగులు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా 2.2 కిలోల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బహిర్గతమైంది.
బంగారం వ్యాపారి జగదీశ్వర్ రావు తన తాకట్టు బంగారాన్ని రూపిక్ బ్యాంక్ నుంచి తీసుకున్న తర్వాత, అది నకిలీ అని అప్రైజర్ ద్వారా ధృవీకరించించగా మోసం జరిగినట్లు తెలిసింది. ఇదే విధంగా జగదీష్, అవినాశ్ అనే మరో ఇద్దరు వ్యక్తులు ఫెడరల్ బ్యాంక్ ద్వారా రూ.68.31 లక్షలు చెల్లించి బంగారం కొన్నారు. అయితే, వారికి అందించిన బంగారం కూడా నకిలీదని అప్రైజర్ నిర్ధారించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మోసానికి రూపిక్ బ్యాంక్ ఉద్యోగులు ఈశ్వరరావు, రాఘవేంద్రరావు, మోహన్ రావు, సుబ్బారావు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరు తాకట్టు బంగారాన్ని అసలైనదానితో మార్చి, కస్టమర్లకు నకిలీ బంగారం ఇచ్చే కుట్ర చేశారు. మోహన్ రావు రూ.68.31 లక్షల రుణం తీసుకుని ఈ మోసానికి రూపకల్పన చేశాడని పోలీసులు గుర్తించారు.
Also Read: అరెస్ట్ భయం.. అజ్ఞాతంలోకి వైసీపీ ముఖ్యనేత.. అసలేం జరిగిందంటే?
బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు 2.2 కిలోల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మరెంత మంది బాధితులు ఉన్నారో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నకిలీ బంగారం మోసాలు మరికొన్ని చోట్ల కూడా గతంలో చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల నకిలీ బంగారం మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, ఉప్పల్‌లో చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు నిదర్శనం.
తాడేపల్లిగూడెం ఘటన
తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో, వీకర్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి 13 కాసుల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.4.20 లక్షల రుణం పొందాడు. అయితే, బ్యాంకు ఆడిటింగ్ మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఆ బంగారం నకిలీదని గుర్తించారు. దీంతో, బ్యాంకు సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించి, సంబంధిత చర్యలు చేపట్టారు.
ఉప్పల్ ఘటన
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి (35), ఆమె భర్త తిరుపతి (42) అనే దంపతులు, గోల్డ్ షాప్ యజమానిని మోసం చేశారు. లక్ష్మి, నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 20,000 వడ్డీకి తీసుకుంది. తర్వాత, బంగారు డాలర్లు కావాలని షాపు యజమానిని అడిగింది. అతను లోపలకు వెళ్లిన సమయంలో షాపులో ఉన్న 12 గ్రాముల అసలు బంగారు డాలర్లను దొంగిలించింది. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షలు, బైక్, సెల్‌ఫోన్, చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటన
కాకినాడలోని యూకో బ్యాంక్‌లో, గోల్డ్ ఆప్రైజర్ శ్రీనివాస్, మరొక ఇద్దరు వ్యక్తులు, నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 2.50 కోట్ల మోసం చేశారు. వారు 30 మంది ఖాతాదారుల పేర్లతో 8 కిలోల 319 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి, ఈ రుణాన్ని పొందారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు, పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.