Doctors Deliver Baby: మయన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూమి కంపించగా.. వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భూ ప్రకంపనల ధాటికి భారీ అంతస్తుల భవనాలు సైతం చిగురుటాకులా ఊగిపోయాయి. భూప్రకంపనలతో కార్యాలయాలు, రైళ్లు, షాపింగ్ మాల్స్ ఊగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలాఉంటే భూకంపం వచ్చిన సమయంలో ఓ మహిళకు పురిటినొప్పులు రాగా.. వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వైద్యులు ఏం చేశారంటే..
బ్యాంకాక్ లోని పోలీసు జనరల్ ఆస్పత్రి వైద్యులు.. ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. భూ ప్రకంపనలు వస్తున్న సమయంలోనే ఓ మహిళకు పురిటినొప్పులు రాగా రోడ్డుపైనే ఆ యువతికి ప్రసవం చేశారు. వైద్య సిబ్బంది మహిళ చుట్టూ చేరి అతి క్లిష్టమైన పనిని పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా వైద్యులు చేసిన కృషిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాంకాక్ వైద్యులకు సెల్యూట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
రోడ్డుపైనే పదుల సంఖ్యలో శిశువులు
మరోవైపు భూకంపం ధాటికి పోలీసు జనరల్ ఆస్పత్రి కంపించిపోయింది. సామాన్లు ఒక్కసారిగా కిందపడిపోతూ ఆస్పత్రిలో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించాయి. దీంతో ఆస్పత్రిలో కొత్తగా జన్మించిన శిశువులను సిబ్బంది హుటాహుటీనా బయటకు తరలించారు. పదుల సంఖ్యలో శిశువులను రోడ్డుపైకి చేర్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ అవుతున్నాయి. ట్రీట్ మెంట్ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంపై సర్వత్రా ప్రసంసలు కురుస్తున్నాయి.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..
నర్సుల వీడియో వైరల్
మయన్మార్, బ్యాంకాక్ లతో పాటు చైనా (China)లోనూ భూమి భారీ ఎత్తున కంపించింది. అక్కడి ఆస్పత్రులు సైతం ఒక్కసారిగా ఊగిపోయాయి. ముఖ్యంగా ఓ ఆస్పత్రిలోని పిల్లల వార్డు కంపించిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు నర్సులు.. శిశువులకు రక్షణగా నిలబడ్డారు. ఓ నర్స్.. శిశువలను ఉంచిన స్ట్రెచర్ కదలాడకుండా పట్టుకొని ఎలాంటి ప్రమాదం జరగ్గకుండా చూసుకుంది. మరో నర్స్.. తన కౌగిళ్లలో ఓ చంటిబిడ్డను గట్టిగా హత్తుకొని కింద కూర్చుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ అవుతున్నాయి. నర్సులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
1,600 మందికి పైగా మృత్యువాత
మయన్మార్, బ్యాంకాక్ లో సంభవించిన భారీ భూకంపం (Mayanmar – Bangkok Earthquake).. పెను విషాదానికి కారణమైంది. ప్రకృతి ప్రకోపం ధాటికి ఇప్పటివరకూ 1,600 మందికి పైగా ప్రాణాలు (Earthquake Deaths)) కోల్పోయినట్లు అక్కడి అధికార వర్గాలు పేర్కొన్నాయి. 3,400 మంది గాయపడినట్లు తెలిపాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారని చెబుతున్నారు. మరణాల సంఖ్య అంతకంతకు పెరిగవచ్చని రెస్క్యూ సిబ్బంది అంచనా వేస్తోంది.