Political News Peddapalli Parliamentary Constituency Ground Report
Politics

Peddapalli: పెద్దపల్లి ఫోకస్, ‘పెద్దన్న’ ఎవరో?

– 4 లక్షల మాదిగల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్
– కుమారుడి గెలుపుకై వివేక్ వ్యూహాలు
– సింగరేణి అండతో గెలవాలని కారు ప్రణాళికలు
– నేతకాని, మాదిగల ఓట్లతో గెలుపు తనదేనంటున్న బీజేపీ
– కాంగ్రెస్‌కి ఇబ్బందిగా మారుతున్న కుల, కుటుంబ సమీకరణాలు
– మాదిగల ఓట్లు దక్కినవారే విజేతలంటున్న సర్వేలు

Political News Peddapalli Parliamentary Constituency Ground Report: తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకట స్వామి రాజకీయ ప్రయాణానికి ఈ స్థానం కేంద్రంగా నిలిచింది. ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణను అభ్యర్థిగా బరిలో దించగా, బీజేపీ ఇక్కడ గోమాసే శ్రీనివాస్‌కు బీఫామ్ ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో గులాబీ పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచి జోరు చూపింది. సింగరేణి బెల్ట్‌లో ఉన్న ఈ స్థానాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోరులో తిరిగి హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్, ‘ఒక్క అవకాశం’ పేరుతో బీజేపీ, హ్యాట్రిక్ అంటూ బీఆర్ఎస్ ప్రచార బరిలో దిగాయి.

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ధర్మపురి నియెజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సుమారు 15 లక్షల ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు సీట్లనూ కాంగ్రెస్ చేజిక్కించుకోవటంతో బాటు ఈ ఎంపీ సీటు పరిధిలో మొత్తం 6.82 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి కొత్త రికార్డును సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్‌కు కేవలం 3.37 లక్షల ఓట్లు రాగా, బీజేపీ కేవలం 80వేల ఓట్లకే పరిమితమైంది. దీనిని బట్టి ఈ ఎంపీ ఎన్నికలో పోటీ అంతా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్యనే ఉండబోతోందని అర్థమవుతోంది.

Also Read:నా ఫోన్, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు: ఈటల

‘హస్త’గతానికి వ్యూహాలు

కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణ ఇక్కడ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈ సీటు పరిధిలోని చెన్నూరులో తండ్రి వివేక్, బెల్లంపల్లిలో పెదనాన్న వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండటం, తాత వెంకట స్వామి రాజకీయ వారసత్వం ఈయనకు కలిసొచ్చే అంశాలు. తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ ఈ ప్రాంతానికి చేసిన సేవలు, ప్రస్తుత కాంగ్రెస్ పథకాలను గుర్తుచేస్తూ వంశీ ప్రచారం సాగుతోంది. ఈ స్థానంలోని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి పరిశ్రమల కార్మికుల మద్దతు పొందేందుకు గానూ వంశీ ఇక్కడి కార్మిక సంఘాల నేతలతో మమేకమవుతున్నారు. ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఉండటం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో భారీ మెజారిటీ సాధించటంతో వంశీ గెలుపు సులభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ యూనియన్ గెలవటం కూడా విజయంపై కాంగ్రెస్ నమ్మకాన్ని పెంచుతోంది.

సింగరేణి సెంటిమెంట్‌తో కారు

సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో చేరగా సింగరేణి మాజీ కార్మికుడైన బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను బీఆర్ఎస్ బరిలో దించింది. ఈ ప్రాంతంలోని తన బంధువర్గం, స్నేహితులు, అనుచరుల మద్దతుతో ఈశ్వర్ ప్రచారం సాగిస్తున్నారు. ఆరుసార్లు గెలిచిన తన రాజకీయ ప్రయాణంలో సాధించిన విజయాలు, గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన మేడారం నియెజకవర్గంలోని ప్రాంతాల్లోని తన మాజీ అనుచరులను కలిసి మద్దతుకోరుతున్నారు. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా కారు పార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉండటం, ఈ ప్రాంతంలో తనకున్న పరిచయాలే తనను గెలిపిస్తాయని ఆయన ఆశలు పెట్టుకున్నారు. గులాబీ నేతల మధ్య సమన్వయ లోపం, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఈయనకు తలనొప్పిగా మారాయి. అలాగే ఇటీవల బీఎస్పీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన దాసరి ఉషా ప్రభావంతో బాటు బీఆర్ఎస్- బీఎస్పీ పొత్తు కూడా తమకు అనుకూలంగా మారనుందని బీఆర్ఎస్‌ అంచనా వేసుకుంటోంది.

Also Read:షర్మిల, సునీత ఆవేదన 1శాతం ప్రజలు వింటే ఏమవుతుంది?

వలస నేతకు బీజేపీ టికెట్

బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోమాసే శ్రీనివాస్ నిజానికి కాంగ్రెస్ నాయకుడే. 1993 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన శ్రీనివాస్, 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడి, గులాబీ పార్టీలో చేరి పెద్దపల్లి బరిలో నిలిచి 2.65 లక్షల ఓట్లు సాధించినా ఓటమి పాలయ్యారు.తర్వాత తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు. ఈ సీటు పరిధిలో శ్రీనివాస్ సామాజిక వర్గమైన మహవీర్ నేతకాని సామాజికవర్గానికి 2.25 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని, ‘ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి’ అంటూ మోదీ చరిష్మాను, పథకాలను ప్రచారం చేస్తూ శ్రీనివాస్ ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి ప్రాంతంలో మాల సామాజిక వర్గం వల్ల తాము రాజకీయంగా నష్టపోయామనే భావన మాదిగ నేతల్లో కనిపిస్తున్నవేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. మందకృష్ణ మాదిగ వంటి నేతల చేత లోకల్ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేయటం ద్వారా మొత్తం మాదిగ ఓట్లను పొందగలిగితే, గోమాసే శ్రీనివాస్ సామాజిక వర్గమైన నేతకాని వర్గపు ఓట్లతో ఈజీగా ఈ సీటు గెలవొచ్చిన బీజేపీ భావిస్తోంది.

డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే

ఇక్కడ బరిలో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా బీజేపీ అభ్యర్థి నేతకాని వర్గపు వ్యక్తి. అయితే.. ఈ నియోజక వర్గంలోని 15 లక్షల ఓట్లలో 4 లక్షల ఓట్లు మాదిగ సామాజిక వర్గానివే. కాగా, ఇప్పటికే ఈ స్థానంలోని రెండు ఎమ్మెల్యే సీట్లు మాల వర్గానికి చెందిన వెంకటస్వామి కుటుంబానికి ఇవ్వగా, తాజాగా ఎంపీ సీటూ వారికే ఇవ్వటంతో, మాదిగ నేతలైన మాజీ ఎంపీ డాక్టర్‌ సుగుణకుమారి, జాతీయ యువజన నాయకుడు ఊట్ల వరప్రసాద్‌, ఆసంపల్లి శ్రీనివాస్‌, గజ్జెల కాంతం, పెర్క శ్యామ్‌ తదితరులు నిరాశకు గురయ్యారు. దీనికి తోడు మాదిగ సంఘాల నేతలంతా ఈసారి కాంగ్రెస్ ఓటమికి సిద్ధం కావాలని పిలుపునివ్వటంతో వెంకటస్వామి కుటుంబం వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే..వీరు కేవలం మాదిగ నేతలకే నచ్చజెప్పగలిగారనీ, నిజానికి ఈ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంకు బీఆర్ఎస్ లేదా బీజేపీకే దక్కబోతోందని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా ఈసారి పెద్దపల్లిలో ఈ సమీకరణమే గెలుపును మలుపు తిప్పే అంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఏకైక స్థానం ఇదే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరుగగా 9 సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టిడిపి, రెండుసార్లు బీఆర్ఎస్, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ కానీ బీజేపి మాత్రం ఒక్కసారి కూడా గెలువలేదు. కనీసం రెండో స్థానానికి సైతం రాలేదు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?