YCP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, అధికార వైసీపీకి మధ్య రసవత్తర పోటీ ఉన్నది. మరోవైపు అన్న జగన్‌కు చెళ్లెల్లు షర్మిల, సునీతలకు మధ్య రాజకీయమైన కుటుంబ పోరు కొనసాగుతున్నది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోక్ సభకు పోటీకి దిగడంతో ఈ పోరు మరింత తీవ్రతరమైంది. కొన్ని రోజులుగా షర్మిల, సునీత అన్న జగన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబాయి వివేకాను హత్య చేసిన వ్యక్తిని(నిందితుడు) జగన్ ఎందుకు కాపాడుతున్నాడని, ఆయనకు ఎందుకు కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అన్న జగన్ రెడ్డి పార్టీకి ఓటువేయొద్దని, షర్మిలను గెలిపించాలని ఇద్దరూ స్పష్టంగా, బలంగా ప్రజలకు చెబుతున్నారు. ఈ పరిణామం జగన్‌కు కొరకరాని కొయ్యగా మారింది.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కుదేలైంది. ఆ పార్టీ ఓటు బ్యాంకును జగన్ స్థాపించిన వైసీపీకి మళ్లింది. వైఎస్ఆర్ అభిమాన నాయకులు, కార్యకర్తలు జగన్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ఎస్సీలు, మైనార్టీలు వైసీపీకి మళ్లారు. కానీ, వైఎస్ఆర్ వారసురాలిగా కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అందులోనూ షర్మిలకు తోడుగా సునీత కూడా జగన్ పై తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారాయి. బాబాయిని చంపిన అవినాశ్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడని, ఆయనకు టికెట్ ఇచ్చి ఎందుకు అండగా నిలుస్తున్నారని ఇద్దరు చెళ్లెల్లు నిలదీస్తున్నారు.
Also Read: పోసాని, అలీ ఎక్కడా? జగన్ మర్చిపోయారా?
వీరి ప్రచారంతో వైసీపీ ఓట్లను కొల్లగొడితే.. అది ఒక్క శాతమైనా జగన్ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. షర్మిల ప్రచారం, పోటీ మొత్తంగా జగన్ కేంద్రంగా ఉన్నది. వైసీపీ ఓటు బ్యాంకే మేజర్‌గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. కాబట్టి, షర్మిల వైపు ఓట్లు మళ్లితే అవి చాలా వరకు వైసీపీ ఓట్లే అయి ఉంటాయి. ఈ ప్రభావం కేవలం కడప వరకే కాకుండా రాష్ట్రమంతా వేలల్లో ఓట్లను కాంగ్రెస్ రాబట్టినా.. అది వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడతాయి. పరోక్షంగా ఈ పరిణామంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనూహ్యంగా లబ్దిపొందే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి, షర్మిల, సునీత ఆవేదన ఆలకించి ఒక్క శాతం ఓటర్లయినా కాంగ్రెస్ వైపు మళ్లితే వైసీపీ పరిస్థితి ఏంటా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.