న్యూఢిల్లీ, స్వేచ్ఛ: Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇలాంటి ప్రకటనలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల వ్యవధిలోగా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మిస్ లీడింగ్ యాడ్స్ అత్యంత హానికరమైనవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్ట్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్-1954 కింద నిషేధిత ప్రకటనలపై ప్రజలు అభ్యంతరాలు లేవనెత్తేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఒక సమగ్ర యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, దీనికి విస్తృత ప్రచారాన్ని కూడా కల్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also read: Akula Neelima: చిట్టీల డబ్బుల వివాదం? బిజెపి నాయకురాలిపై ఆరోపణలు?
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్-1954 చట్టంలోని రూల్స్ అమలుపరచే విషయంలో పోలీసులు కూడా కల్పించుకొని అవగాహన పెంపొందించాలని ఆదేశించింది. కాగా, గతంలో యాడ్స్ నియంత్రణ విషయంలో పలు మార్గదర్శకాలు ఇచ్చినట్టు గుర్తుచేసిన బెంచ్, ప్రకటనలు జారీ చేసే ముందు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్ -1994 ప్రకారం ‘సెల్ఫ్ కన్ఫర్మేషన్’ తీసుకోవాలని పేర్కొంది. ఆధునిక మెడికల్ విధానాలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దంటూ పతంజలిని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో, పతంజలి సంస్థ క్షమాపణలు కోరింది.