Telangana Govt: కొత్త సంవత్సరంలో కొత్త పాలనను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నది. సంక్షేమ పథకాల అమలు మొదలు ప్రభుత్వ ప్రాధాన్యతలను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ముసాయిదా జాబితా రూపొందినట్లు సచివాలయ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి పరిశీలన తర్వాత ఆమోదం రాగానే లాంఛనంగా ఉత్తర్వులు జారీ కానున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఐఏఎస్ ఆఫీసర్లను, ఆ తర్వాత ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలనే ఆలోచన ఉన్నది. జిల్లా కలెక్టర్ల మొదలు వివిధ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్ల వరకు సమర్ధులైన అధికారులకు కీలక బాధ్యతలు ఇచ్చేలా పోస్టింగ్‌లు దక్కనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల కొరత ఇప్పటికే వేధిస్తున్నది. దీనికి తోడు అనుభవం ఉన్న అధికారులు లేనందున అందుబాటులో ఉన్నవారితోనే సర్దుబాటు చేస్తున్నది. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా సమర్ధులైనవారికి కీలక బాధ్యతలు అప్పజెప్పాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏప్రిల్ చివర్లో రిటైర్ అవుతుండడంతో ఆ స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును నియమించినా కొంతకాలం ఫైనాన్స్ బాధ్యతలను కూడా ఆయన దగ్గరే ఉంచే అవకాశమున్నదనేది సచివాలయ వర్గాల వాదన.
Also Read: AP P4 Policy: ఏపీలో పేదలకు పట్టాభిషేకం.. చకచకా ఏర్పాట్లు..
ఎలాగూ కొత్త సీఎస్ రావడం అనివార్యం కావడంతో దానికి తగినట్లుగా పలు శాఖల సెక్రటరీల మార్పు తప్పేలా లేదు. దీంతో అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీ విషయంలో ఆచితూచి అడుగేయనున్నది.
గత ప్రభుత్వంలో కీలక శాఖల్లోని ఉన్నత స్థానాల్లో కొందరు అధికారులు పాతుకుపోవడంతో ద్వితీయ శ్రేణిలో ఉన్న ఆఫీసర్లకు ఆ అంశాలపై పట్టు రాకుండాపోయింది. దీన్ని గుర్తించినందునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కొందరిని ఎదిగించాలన్న ఉద్దేశంతో కీలక శాఖల్లో అదనపు సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ పోస్టులతో నియమించారు. ఆయా అంశాలపై పట్టు ఏర్పర్చుకున్న తర్వాత వారికే కీలక బాధ్యతలు ఇచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రత్యామ్నాయమే లేదనే పరిస్థితి నుంచి కొత్తవారిని సన్నద్ధం చేసే దిశగా చేసిన ప్రయత్నాలు ఒక మేరకు ఫలించాయి. దీనికి తోడు అధికారులు, మంత్రులకు మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా భర్తీ చేసే తీరులో ఇటీవల సమీక్షా సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేయించారు. సంతృప్తికరంగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించారు.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి రద్దీ సమాచారం.. మీచేతిలోనే..
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపైన మరో లెక్క.. అనే తీరులో ప్రభుత్వానికి 15 నెలల హనీమూన్ పీరియడ్ ముగిసిపోవడంతో ఇక పాలనపైన, సంక్షేమ పథకాల అమలుపైనా, హామీలను నెరవేర్చడంపైనా దృష్టి పెట్టి బడ్జెట్ రూపకల్పన మొదలు బాధ్యతలను నిర్వర్తించి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎలాగూ రిటైర్డ్ అధికారులను ఎక్స్ టెన్షన్ పేరుతో కొనసాగుతున్నందున తలెత్తుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారిని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బదిలీలకు ముందు ఇచ్చిన ఈ షాక్ ట్రీట్‌మెంట్ ముఖ్యమంత్రి మూడ్‌ను చెప్పకనే చెప్పిందని సీఎంఓ వర్గాలు అభిప్రాయపడ్డాయి.