నల్లగొండ స్వేచ్చ : Devara Konda: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉద్దేశించి పౌష్టికాహారం, వైద్య చికిత్సలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీల చేతుల్లోనే ఉందని, వారు తీసుకోబోయే ఆహారం, జాగ్రత్తల పైనే పుట్టబోయే పిల్లలు ఆధారపడి ఉంటారన్నారు.
ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం, తల్లి, బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. దేవరకొండ ప్రాంతంలో మహిళల్లో రక్తహీనత, మాత, శిశు మరణాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మేనరిక వివాహల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ ప్రాంతంలో మహిళలు వివిధ రకాల జబ్బులతో బాధపడడం తాము గుర్తించినట్లు తెలిపారు. వీటన్నిటిని అరికట్టేందుకు మహిళల్లో పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా, సరైన సమయంలో వైద్య చికిత్సలు పొందడం, పుట్టబోయే బిడ్డ, పుట్టిన పిల్లల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేవరకొండ ప్రాంతంలో సంభవించే ప్రతి శిశు మరణం కేసును కూలంకషంగా సమీక్షిస్తున్నామని తెలిపారు. సరైన ఆహారం తీసుకోకుంటే పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుడతారని, అవయవాలు సరిగా లేకుండా పుడతారని, ముఖ్యంగా మేనరికం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయన్నారు . గర్భిణీ స్త్రీలు తీసుకునే భోజనం పైనే భావితరాలుఆధారపడి ఉంటాయన్నారు. స్థానికంగా లభించే తృణధాన్యాలు ,పప్పులు వంటి ఆహారాన్ని తీసుకోవాలని, ఆకుకూరలు ,కూరగాయలతో పాటు, మాంసకృతులు తీసుకోవాలని చెప్పారు.
పిల్లలు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు జాగ్రత్తగా చూసుకోవాలని, ఆయా సమయాలలో టీకాలు వేయించడం, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అవసరమైన మందులు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు ,ఓఆర్ఎస్ పాకెట్లు, కొబ్బెర నీళ్లు , పళ్ళ రసాల వంటివి గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం అంతగా పుడతారని చెప్పారు. భవిష్యత్తులో మహిళలు మంచి స్థానంలో ఉండాలంటే ఇప్పటినుండే పౌష్టికాహారంతో పాటు, బాగా చదువుకోవడం, ముందస్తు ప్రణాళిక వేసుకోవడం చేయాలన్నారు.
Also Read: CM Revanth Reddy: మాటలకు తగ్గ చేతలు’.. రేవంత్ ను ఆకాశానికెత్తిన మరో సీఎం
మగ, ఆడ వివక్షతను విడనాడాలని, ఎట్టి పరిస్థితులలో లింగనిర్ధారణ పరీక్షలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు, చేయించుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో కుమారుల కంటే కూతుర్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని, అందువల్ల వివక్షను చూపించవద్దని పునరుద్గాటించారు. సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు