తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : CM Revanth Reddy: డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయానికి అన్ని పార్టీలూ కలిసిరావాలని, కేంద్రంపై పోరాడేందుకు రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో గురువారం తీర్మానాన్ని ప్రతిపాదించడం, సభ ఆమోదం తెలపడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. మాటల్లోనేకాక చేతల్లోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చెప్పిన మాటలను సీఎం రేవంత్‌రెడ్డి చేతల్లో చూపించారని ప్రశంసించారు.
న్యాయం, సమానత్వం, సహకార సమాఖ్య స్ఫూర్తిని సమర్థిస్తూ సరైన రీతిలో పునర్విభజన కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ విషయంలో ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నయినా ప్రతిఘటించే సమష్టితత్వాన్ని ఇలాంటి స్ఫూర్తి బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
Also Read: Bhatti Vikramarka: తెలంగాణ అప్పులపై కాగ్ సంచలన రిపోర్ట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
చెన్నైలో ఈ నెల 22న జరిగిన జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) తొలి సమావేశంలో ప్రతిపాదించిన అంశాలు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన తరహాలో హైదరాబాద్‌లో నెరవేరాయని, ఇది ఆరంభం మాత్రమేనని, హైదరాబాద్‌లో త్వరలో జరిగే రెండో సమావేశం నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాలు అదే బాటలో నడుస్తాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును అధర్మ మార్గాన ఒక ప్రాంతానికి అన్యాయం చేసే రీతిన రాసేందుకు ప్రయత్నించే ఎవరినీ అనుమతించబోమని సీఎం స్టాలిన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌పై తెలంగాణ శాసనసభలో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు