CM Revanth Reddy: అధికారంలోకి వచ్చాక సుమారు ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత సమావేశాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు, ఫ్లోర్ మేనేజ్ మెంట్ ల్లో కొంత విఫలమైన ప్రభుత్వం ఈ సారి ఆ లోపాలను చాలా వరకు అధిగమించిందనే అభిప్రాయాలు అసెంబ్లీ లాబీల్లో వెల్లడయ్యాయి. కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టిన చివరిరోజు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రులు కూడా ఓ రేంజ్ లో ప్రధాన ప్రతిపక్షాన్ని నిలువరించారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతీ విషయాన్ని కౌంటర్ చేయటంలో ఫుల్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపించింది.
బడ్జెట్ సెషన్ తో మరింత బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి
తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణ రాజకీయ వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేయగలిగారు. బడ్జెట్ సెషన్ లో ఆయన ప్రదర్శించిన లీడర్ షిప్ ఈ విషయం మరింత స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీని హద్దుల్లో ఉంచుతూ, తన ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించటంలో, కాంగ్రెస్ బాణీని గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్స్, హద్దు మీరితే ఉపేక్షించమనే సిగ్నల్స్.
సెషన్ మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్ అనేక రకాల ఆరోపణలు చేస్తూ విపక్ష హోదాను ఉపయోగించుకోవాలని చూసింది. అయితే, రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు, విప్ లు, ఎమ్మెల్యేలు అవసరమైనప్పుడల్లా సముచితమైన సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ పనితీరును సమర్థంగా సమర్ధించడంతో పాటు, బీఆర్ఎస్ చేసిన తప్పులను హైలైట్ చేయడంలోనూ విజయవంతమయ్యారు. సమావేశాల ఆరంభంలోనే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయటం ద్వారా హద్దుల్లో ఉండకపోతే వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. దీంతో మిగతా సెషన్ అంతా బీఆర్ఎస్ సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో సంయమనం పాటించేలా డిఫ్సెన్ లోకి నెట్టగలిగారు.
సొంత పార్టీ సభ్యులతో పాటు, విపక్షానికి స్ట్రాంగ్ సిగ్నల్స్
ఈ సెషన్ లో రేవంత్ కేవలం విపక్షానికే కాదు, తన సొంత పార్టీ నేతలకు కూడా క్లియర్ సిగ్నల్స్ ఇచ్చారు. తన నాయకత్వాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవడానికి అవసరమైన స్ట్రాంగ్ సిగ్నల్స్ అందించారు. కేవలం ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడమే కాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా క్రమశిక్షణతో నడిపించే దిశగా ముందుకు సాగారు. సభకు సకాలంలో హాజరుకాని వారికి చురకలు, వచ్చి అలసత్వంగా ఉన్నవారికి హెచ్చరికలు చేస్తూ ముఖ్యమంత్రి స్వయంగా సమన్వయం చేశారు.
Also Read: Fake Tickets Scam: రైల్వే టికెట్ చెక్ చేయండి.. ఇలాంటి మోసాలతో తస్మాత్ జాగ్రత్త!
ఫ్లోర్ మేనేజ్‌మెంట్ లో మెరుగైన ప్రదర్శన
గత సమావేశాలతో పోలిస్తే, ఈసారి ఫ్లోర్ మేనేజ్‌మెంట్ లో కాంగ్రెస్ పార్టీ కచ్చితమైన వ్యూహాన్ని అనుసరించింది. మంచి సమన్వయంతో సభా కార్యకలాపాలను చక్కగా నడిపిస్తూ, ప్రతిపక్ష ఆందోళనలకు ఎదుర్కొంటూ సమయోచిత సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలను వివరించేందుకు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను సమర్థంగా వినియోగించుకున్నారు.
మొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా నడిచిన సభ
ఈసారి అసెంబ్లీ సమావేశాలు గతంకంటే మరింత ప్లాన్డ్ గా, ప్రాజాస్వామ్యయుతంగా నడిచాయనే ప్రశంసలు లాబీల్లో వినిపించాయి. ఓ వైపు విపక్షాలను కంట్రోల్ చేస్తూనే, మరోవైపు అన్ని పార్టీలకు, అన్ని సబ్జెక్టులపై మాట్లాడే అవకాశం కల్పించారు. యువ ఎమ్మెల్యేలు వీలైనంతగా సభలో మాట్లాడే వెసలుబాటు ఈ సభ ద్వారా జరిగిందని అన్ని పార్టీల నేతలూ ఒప్పుకున్నారు.
భవిష్యత్తు పాలన కోసం స్ట్రాంగ్ ప్లాన్
ఈ బడ్జెట్ సెషన్ విజయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత ఉత్సాహంతో పాలనను గాడిలో పెట్టే వ్యూహాలకు పదును పెట్టే అవకాశముంది. ప్రజల సమస్యల పరిష్కారంలో మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతారని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. బడ్జెట్ లో కేటాయింపులు, గ్యారెంటీల అమలుకు, యువవికాసం పథకం లాంటి వాటికి నిధుల్ని సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతామనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు.
Also Read: Ramzan Holidays: ఒక్కరోజు కాదు.. రెండు రోజులు.. ప్రభుత్వం తాజా ప్రకటన ఇదే!
తాజా అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని మరింత బలంగా నిరూపించుకోగలిగారు. ముఖ్యంగా చివరిరోజు సభలో ఆయన మాట్లాడిన విధానం, జైలు జీవితంతో పడిన ఇబ్బందుల ప్రస్థావన ఆకట్టుకునేలా సాగింది. అలాగే రాజకీయ కక్ష సాధింపులు ఉండవు అనే సిగ్నల్ ఇవ్వటం ద్వారా రాజనీతిని ప్రదర్శించారనే టాక్ పెరిగింది. పాలనా దక్షత, రాజకీయ వ్యూహం.. ఈ రెండిటిలోనూ ఆయన తనదైన శైలిని కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారని సభ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు చర్చించుకోవటం కనిపించింది.