CM Chandrababu: ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం పక్కన పెట్టిందని, అందువల్లే పనులు ఆలస్యం అయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014-2019 మధ్య తాను 33 సార్లు ప్రాజెక్ట్‌ను సందర్శించానని, కానీ గత ముఖ్యమంత్రి ఐదేళ్లలో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఖర్చు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వాసితులను వారు పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఆయన గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను సమీక్షించి, పురోగతిని పరిశీలించారు. ఉదయం ప్రాజెక్టు స్థలానికి చేరుకున్న చంద్రబాబు, ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నిర్వాసితులను ఆదుకుంటాం..
పోలవరం నిర్వాసితులతో సమావేశమైన చంద్రబాబు, వారి సమస్యలను స్వయంగా విన్నారు. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న సమస్యలను ఆయన ముందు నిర్వాసితులు వివరించారు. . ‘వరదల సమయంలో తమ ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చినా, నాన్-రెసిడెంట్‌గా చూపించి పరిహారం ఇవ్వలేదని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పోలవరం కోసం భూమిని త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: పిఠాపురంలో మళ్లీ రచ్చ.. పవన్ ఇలాకాలో అసలేం జరుగుతోంది?
గతంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించినట్లు చెప్పిన చంద్రబాబు, గత ప్రభుత్వం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రూ.10 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసితులకు రూ.828 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
Also Read: లేడీ అఘోరీ లక్ష్యమేంటి? రంగంలోకి సీబీ సీఐడీ?
2026 డిసెంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, పునరావాసం పూర్తయిన తర్వాతే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.