ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ: Khammam Collector: మహిళల పట్ల వివక్షకు కారణం ఆర్ధికంగా బలంగా లేకపోవడమేనని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తనికెళ్ళలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల చిన్న చూపు ఉన్న దశలో ఎలాంటి చర్చ లేకుండానే మహిళలకు ఓటు హక్కును మన దేశం కల్పించిందన్నారు.
ఆర్థికంగా బలోపేతం కాక పోవడమే మహిళల పట్ల ఉన్న వివక్షకు కారణమని గమనించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు ప్రారంభించిందన్నారు. చదువులో బాలుర కంటే అధికంగా బాలికలు రాణిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్ల పుడితే గర్వ కారణం అని చాటి చెప్పేందుకు జిల్లాలో గర్ల్ ప్రైడ్ అనే వినూత్న కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, జిల్లాలో ఎక్కడ ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారి స్వీట్ బాక్స్ తో వెళ్ళి ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టల్లో ఉన్న బాలికలకు అధిక బాధ్యత ఉందని,
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారని, మీరు రాణించి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకొని నలుగురికి ఆదర్శం కావాలని కలెక్టర్ తెలిపారు. మహిళలకు చేయలేని పని అంటూ ఏదీ ఉండదని, మనలో ఉన్న సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలన్నారు. మన జీవితంలో ధైర్యం చేస్తేనే పైకి ఎదుగుతామని, ఇతరుల మాటలు పట్టుకుంటే ఏమీ సాధించలేమన్నారు. ప్రతి రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ప్రతి మహిళ నిర్దేశించుకోవాలని అన్నారు.
Also Read: MAD Square Trailer: ” మ్యాడ్ స్క్వేర్ ” ట్రైలర్ రిలీజ్.. ఈ సారి థియేటర్లో రచ్చ రచ్చే
ఖమ్మం జిల్లా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉత్తమమైన ప్రతిభ కలిగిన విద్యార్థినులు ఉన్నారని, వీరికి ప్రైవేట్ కంపెనీలోఅవకాశం కల్పిస్తే తప్పనిసరిగా రాణిస్తారని, కంపెనీలకు విశ్వాసంగా ఉంటూ వాటి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు. చిన్నతనంలో విజయలక్ష్మి మేడం అనే టీచర్ బోధన పద్ధతులు మార్చి తనపై తీసుకున్న శ్రద్ధ కారణంగానే తాను నేడు కలెక్టర్ స్థాయికి చేరుకున్నానన్నారు. టీచర్ల విలువ ఎప్పటికీ మర్చిపోవద్దని, వారి శ్రమ ఫలితం వృధా కాకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మనం మరో నలుగురికి సహాయం చేయాలని, సమాజంలో ఇతరుల అభివృద్ధికి మనం తోడ్పాటు అందిస్తే వచ్చే సంతృప్తి మరో కార్యక్రమంలో ఉండదని కలెక్టర్ తెలిపారు. తదుపరి జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి మాట్లాడుతూ మా పాప మా ఇంటి మణి దీపం అనే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చదువు మాత్రమే మనల్ని కాపాడుతుందని, ఈ అంశం ప్రతి మహిళ గుర్తుంచుకోవాలని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఇంటర్వ్యూ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రజిత, ఉపాద్యాయులు, కంపెనీ ప్రతినిధులు, విద్యార్థినులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Also Read: Mana Ooru Mana Badi Scam: కాళేశ్వరంను మించిన పెద్ద స్కామ్ ఇదే.. సంచలన ఆరోపణలు చేసిన మజ్లిస్..