Delivery Boys: డెలివరీ బాయ్స్ పరిస్థితి.. తలుచుకుంటే ఔరా అనాల్సిందే. సాటి మనిషిని గౌరవించని పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయని చెప్పేందుకు డెలివరీ బాయ్స్ ప్రత్యక్ష సాక్షమని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
నేటి స్పీడ్ యుగంలో ఏ వస్తువైనా క్షణాల్లో మన చెంతకు చేరుతుంది. జస్ట్ అలా మొబైల్ ద్వారా ఒక్క క్లిక్ తో మనకు కావాల్సిన పరికరాలను మనం బుక్ చేసుకొనే సదుపాయం మన ముందర ఉంటుంది. అంతేకాదు మనకు కావాల్సిన ఆహారం సైతం ఇదే రీతిలో మన చెంతకు చేరుతుంది. అలా బుక్ చేసుకున్న వాటిని క్షణాల్లో మన చెంతకు చేర్చే వారే డెలివరీ బాయ్స్.
ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులకు డెలివరీ బాయ్స్ ఉద్యోగం ఉపాధిగా మారింది. అందుకే నగరాలు, పట్టణాలలో ఎందరో డెలివరీ బాయ్స్ గా రాణిస్తూ, తమ జీవనం సాగిస్తున్నారు. డెలివరీ బాయ్స్ కి ఉపాధి లభించినా, వీరు ఎదుర్కునే సమస్యలు మాత్రం అనేకం. కొందరు మద్యం మత్తులో దాడులకు పాల్పడడం, మరికొందరు వేరే విధంగా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉన్న పరిస్థితి.
ఈ కారణాలతో డెలివరీ బాయ్స్ గా రాణించేందుకు యువత కాస్త వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇదే రీతిలో ఇటీవల ఏపీలోని విశాఖపట్నం ఆక్సిజన్ టవర్స్ వద్ద డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. ఈ దాడికి గల కారణాలు తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. కస్టమర్ ను అన్నా అని పిలిచినందుకు ఆ కస్టమర్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. స్విగ్గి డెలివరీ బాయ్ గా అనిల్ అదే రోజు డ్యూటీలో జాయిన్ అయ్యాడు.. అదే రోజు దాడికి గురయ్యాడు. కేవలం సార్ అనే పిలుపును పలకనందువల్లే ఈ దాడి జరిగినట్లు అనిల్ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
దీనిని బట్టి చూస్తే డెలివరీ బాయ్స్ బయట సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు అని చెప్పవచ్చు. వస్తువులను డెలివరీ చేయడానికి వెళ్ళిన సమయంలో తమను చాలా హీనంగా చూస్తున్నారని, అంతేకాకుండా తీసుకెళ్లిన వస్తువులపై పసుపు నీళ్లు చల్లి మరీ తీసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మార్గంగా ఎంచుకొని తాము డెలివరీ బాయ్స్ గా మారామని, తమను చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
కనీసం మనిషి మొఖం కూడా చూడకుండా మొహం మీదే తలుపులు వేస్తున్నారని, కొంతమంది తీసుకువెళ్లిన వస్తువులను దూరాన ఉంచమని చెబుతున్నారట. ఆ తర్వాత వారు వచ్చి తీసుకెళుతున్నట్లు తెలుపుతున్నారు. ఎన్నో అపార్ట్మెంట్లలో లిఫ్టులు పని చేయకపోయినా అన్ని అంతస్తులు పైకి ఎక్కి, తాము వస్తువులు అందిస్తున్నామని, కొంతమంది కుక్కలను వదిలి తమను భయపెట్టాలని చూస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
Also Read: AC Helmets: ఎండలోనూ ఏసీలో ఉన్నట్లే.. పోలీసుల సరికొత్త ప్రయోగం..
కుటుంబాల కోసం తాము కష్టపడుతుంటే ఇంత హీనంగా చూస్తారా అంటూ డెలివరీ బాయ్స్ ప్రశ్నిస్తున్నారు. స్విగ్గి, జోమాటో ఇతర టీ షర్ట్లు ధరిస్తే చాలు.. చివరకు హోటల్స్ వారు కూడా తమను దారుణంగా అవమానించే పరిస్థితి ఉందని, టీ షర్ట్ తీసి లోపలికి వెళ్తే కస్టమర్ గా ట్రీట్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా మనుషులుగా గుర్తించాలని, ఇప్పటికైనా డెలివరీ బాయ్స్ ను గౌరవించాలని వారు కోరుతున్నారు.