AP Mega DSC notification: ఏపీలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సీఎం చంద్రబాబు ఎట్టకేలకు కలెక్టర్ల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీనితో ఏప్రిల్ నెలలో ఆ మెగా సంబరం జరుగుతుందని భావించవచ్చు. ఇంతకు సీఎం చేసిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబు ముందుగా ఆయా జిల్లాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ లను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలన్నారు. కలెక్టర్లు అధికార దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారన్నారు. ఈ కామెంట్స్ పరోక్షంగా వైసీపీని దృష్టిలో ఉంచుకొని చేసినట్లుగా భావించవచ్చు.
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మా విధానం అంటూ సీఎం పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు. ఇక మెగా డీఎస్సీ గురించి సీఎం మాట్లాడుతూ.. ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేసామని, పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని తెలిపారు. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లకు, విద్యాశాఖ అధికారులకు సీఎం సూచించారు. జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తామని సీఎం ప్రకటించారు. అలాగే 10 వేల రూప్ టాప్ సోలార్ విద్యుత్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఆ లక్ష్య సాధనకు కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేగాక వివిధ ఉత్తమ విధానాలను అవలంభించడం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
Also Read: RTGS – WhatsApp Governance: ఏపీలో అంతా క్షణాల్లోనే.. ఆ కష్టాలకు ఇక చెల్లు..
సీఎం చేసిన ప్రకటనతో మెగా డీఎస్సీపై కమ్ముకున్న మేఘాలు పక్కకు వెళ్లాయని చెప్పవచ్చు. మొత్తం మీద డీఎస్సీ కోసం ఎదురుచూపుల్లో ఉన్న అభ్యర్థులు, సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. పుస్తకం చేతిలో పట్టండి.. ప్రిపేర్ కండి.. మీ లక్ష్యాన్ని చేరుకోండి అంటూ అభ్యర్థులకు విద్యావేత్తలు సూచిస్తున్నారు.