తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Telangana Cabinet: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది పండుగ తర్వాత కంప్లీట్ చేయాలని ఏఐసీసీ సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీ వివరాలు బహిర్గతం కాలేదు.
మంత్రివర్గం విస్తరణ గురించి చర్చించి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అంశాలపై పేర్లవారీగా రాష్ట్ర నేతల నుంచి ఏఐసీసీ అభిప్రాయం తీసుకున్నది. చాలాకాలంగా అవకాశాన్ని ఆశిస్తున్న ఆశావహులందరి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. చివరకు హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది. దాదాపు డజను మంది మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లోనే ఏఐసీసీ ప్రకటన విడుదలయ్యే అవకాశమున్నది.
విడివిడిగా అభిప్రాయాల సేకరణ :
తొలుత రాష్ట్ర నేతలందరి నుంచీ సమావేశంలో అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ పెద్దలు ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి విడివిడిగా కూడా వివరాలను తీసుకున్నారు. ఏయే కారణాలతో ఎవరి పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారో కూడా రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ గమనంలోకి తీసుకున్నారు. ఏ ప్రాతిపదికన ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందనే అంచనాలనూ రాష్ట్ర నేతలను వివరించారు.
Also Read: Ramulu Naik on KCR: కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. అదేంటి అంతమాట అనేశారు!
అసంతృప్తికి తావు లేకుండా జిల్లాలు, సామాజిక సమీకరణాలను పరిశీలించినట్లు తెలిసింది. ఏడాదిన్నరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నందున ఒకేసారి ఆరింటిని భర్తీ చేయాలనే ఏఐసీసీ అంచనాకు వచ్చినట్లు సమాచారం. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన చీఫ్ విప్ పోస్టు ఇవ్వడంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మహిళ కోటాతో పాటు ఏఐసీసీ ఆలోచన ప్రకారం విజయశాంతికి అవకాశాలపైనా చర్చించినట్లు సమాచారం.
ముహూర్తంపైనా లోతుగా చర్చలు :
మంత్రివర్గ విస్తరణుకు అనువైన సమయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనుండడం, అమావాస్య రోజులు, కొత్త సంవత్సరం (ఉగాది) తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముహూర్తాన్ని ఖరారు చేయాలనే చర్చలు జరిగాయి. ఉగాది రోజు లేదా ఆ తర్వాత ముహూర్తం ఫిక్సయ్యే అవకాశాలున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలని పీసీసీ, ఏఐసీసీ మధ్య చర్చలు ముగిసిపోవడంతో ఇక ప్రమాణ స్వీకారానికి తేదీని ఖరారు చేయడమే మిగిలింది. ఎలాగూ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చినందున ఇక ఆలస్యం లేకుండా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనేది ఏఐసీసీ ఆలోచన. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏఫ్రిల్ ఫస్ట్ వీక్‌లోనే పూర్తిస్థాయి మంత్రివర్గం ఫంక్షనింగ్‌లోకి రానున్నది. ప్రస్తుతం మంత్రివర్గంలోని ఆరు ఖాళీలనూ ఒకేసారి భర్తీ చేయాలని ఏఐసీసీ భావిస్తున్నా నిర్ణయం వెలువకపోవడంతో ఉత్కంఠ నెలకొన్నది.
ఆశలు పెట్టుకున్న నేతలు వీరే :
ఏఐసీసీ గతంలోనే హామీ ఇచ్చిన జాబితాలో గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉండగా రాష్ట్ర నాయకత్వం జాబితాలో వాకిటి శ్రీహరి, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి సైతం దాదాపుగా మంత్రివర్గంలోకి రావచ్చనే మాటలూ వినిపిస్తున్నాయి. మైనారిటీ కోటా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనేది పార్టీ విధానపరంగా తీసుకున్న నిర్ణయం కావడంతో ఎమ్మెల్సీగా ఉన్న ఆమెర్ ఆలీ ఖాన్ పేరు ఖరారయ్యే అవకాశమున్నది.
మరోవైపు సీనియర్ నేతగా ఉన్న ప్రేమ్‌సాగర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఓ సీనియర్ మంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. మొత్తం ఆరు పోస్టులకు తొమ్మిది మంది పేర్లను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకున్నా చివరకు ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మంత్రుల్ని తొలగించవచ్చనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా పీసీసీ, ఏఐసీసీ నేతల సమావేశంలో చర్చకు రాలేదని సమాచారం.
జిల్లాల, సామాజిక వర్గాల సమీకరణాలు :
ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలతో పాటు సామాజికవర్గాల కోణం నుంచి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ పేర్లపై చర్చ జరిగి ఒకరికి చోటు దక్కే అవకాశమున్నది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్‌రెడ్డి పేరుపైనా చర్చ జరిగింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఒకరికి చీఫ్ విప్ దక్కే అవకాశమున్నది. సామాజిక సమీకరణాల రీత్యా బీసీల నుంచి ఇద్దరికి (ముదిరాజ్, మున్నూరుకాపు), రెడ్డి కమ్యూనిటీ నుంచి ఇద్దరికి, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసినందున మాల కమ్యూనిటీ నుంచి ఒకరికి, మైనారిటీ నుంచి ఒకరికి ఇచ్చే అవకాశాలున్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎస్టీ కమ్యూనిటీకి ఇవ్వడంపై చర్చలు జరిగాయి.
డిప్యూటీ స్పీకర్ నామినేటెడ్ పోస్టులు సైతం :
మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్నా అవకాశం రాకపోవడంతో అసంతృఫ్తికి గురయ్యేవారిని కీలకమైన నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసే ఆలోచన కూడా పీసీసీ, ఏఐసీసీ నేతల మధ్య ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల్ని (ఆర్టీసీ చైర్మన్, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్.. తదితరాలు) సైతం భర్తీ చేయడంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం.
Also Read: Meenakshi Natarajan: ఐక్యరాగమెత్తిన కాంగ్రెస్.. మీనాక్షి నటరాజన్ మార్క్ ఇదేనా?
ఇదే సమయంలో పార్టీలోనూ కొందరు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో పీసీసీ కార్యవర్గ కూర్పుపైనా ఈ సమావేశంలో రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఏఐసీసీ పెద్దలు తీసుకున్నారు. తొలుత మంత్రివర్గ విస్తరణను పూర్తిచేసి ఆ తర్వాత పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశమున్నది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గా పనిచేసిన మాణిక్‌రావ్ థాక్రే సైతం ఈ సమావేశానికి కొద్దిసేపు హాజరై వెళ్ళిపోవడం గమనార్హం.
నిర్ణయం తీసుకునేది అధిష్టానమే :
పీసీసీ చీఫ్ రాష్ట్ర నేతలతో ఏఐసీసీ పెద్దలు సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించారని, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని, తుది నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాకు వివరించారు.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితి గురించి ఆరా తీశారని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ తర్వాతి స్పందన, కులగణన గణాంకాల ఆధారంగా జరిగిన బీసీ రిజర్వేషన్ బిల్లు, వీటి ద్వారా ఆయా సెక్షన్ల ప్రజలకు కలిగే ప్రయోజనం తదితరాల గురించి ఏఐసీసీ నేతలు అడిగి తెలుసుకున్నారని పీసీసీ చీఫ్ వివరించారు. అన్ని విషయాలపైనా రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తీసుకున్న ఏఐసీసీ త్వరలోనే వీటిని కొలిక్కి తీసుకొస్తుందని భావిస్తున్నామన్నారు.
Also Read: MLA Raja Singh: కన్నెత్తి చూస్తే అంతే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన