తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Telangana Bhavan: రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్‌పై ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అక్కడి రెసిడెంట్ కమిషనర్ సహా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దేశ రాజధానిలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా భవన్ నిర్మాణమవుతుందని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే సమకాలీన ఆధునిక సౌకర్యాలనూ జోడిస్తామని వివరించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న భవన్ స్థానంలో రాష్ట్రానికి విడిగా కొత్త భవనాన్ని నిర్మించడంపై గత కొంతకాలంగా జరుగుతున్న కసరత్తు కీలక దశకు చేరుకున్నది. ప్రస్తుతం తెలంగాణ వినియోగిస్తున్న భవనాలను పరిశీలించిన జితేందర్‌రెడ్డి.. రాష్ట్ర వాటాగా వచ్చిన ఖాళీ స్థలాన్ని కూడా పరిశీలించి కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు.
Also read: Revanth Reddy – Delimitation: కేంద్రంపై పోరులో ‘తగ్గేదేలే’.. చెన్నైలో తేల్చేసిన సీఎం రేవంత్
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నూతన భవన్ నిర్మాణాన్ని చేపడుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వాటాగా వచ్చిన స్థలంలో ఇప్పటికే శబరి బ్లాక్ భవనం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవన నిర్మాణ పటిష్టతపై ఇంజినీర్ల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. మరింత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఆరా తీసి కొన్ని సూచనలు చేశారు.
ప్రతిపాదిత నూతన తెలంగాణ భవన్ నిర్మాణానికి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించే దిశగా ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఢిల్లీని సందర్శించే తెలంగాణ పౌరులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అవసరాలను సమర్థంగా తీర్చేలా కొత్త భవన్‌ను నిర్మిస్తామన్నారు. సుసంన్నమైన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక నిర్మాణ రీతులు, సమకాలీన సౌకర్యాల కల్పనతో అద్భుతంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/3988644/TG-Edition/Swetcha-daily-TG-epaper-21-03-2025#page/1/1