Rajanna Sircilla Crime: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ కొందరు మూఢనమ్మకాలను వదలడం లేదు. మంత్రాలకు చింతకాలు రాలతాయన్న చందంగా బురిడి బాబాలను నమ్ముకొని మోసపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఫేక్ బాబాల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫేక్ బాబా.. ఆడవారి జీవితాలతో ఆడుకున్నాడు. మంత్రాలతో సమస్యలు తీరుస్తానని చెప్పి పలువురి మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళ్లే..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి.. ఫేక్ బాబా అవతారం ఎత్తాడు. మంత్రాలతో సమస్యలు తొలగిస్తానంటూ కొందరు మహిళలను నమ్మించాడు. ఈ క్రమంలో వారికి మత్తుపదార్థాలు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను రికార్డు చేసి బాధితులను బెదిరించడం ప్రారంభించాడు.
అరెస్టు చేసిన పోలీసులు
అత్యాచార వీడియోలతో మహిళలను బెదిరిస్తున్న ఫేక్ బాబా బాపుస్వామిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేసు గురించి వివరించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.. నిందితుడి నుంచి రెండు ఫోన్లు, తాయత్తులు, పౌడర్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతని ఫోన్లలో పలువురితో ఉన్న వీడియోలు, ఫొటోలు గుర్తించినట్లు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనబడితే ఆయా పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.