Ayyanna Patrudu on YCP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions 2025) నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభ్యుల హాజరు గురించి మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu).. విపక్ష వైసీపీ (YSRCP)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల విషయంలో దొంగల్లా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలా చేసిన ఎమ్మెల్యే పేర్లను సభలో చదివి వినిపించిన స్పీకర్.. ఓటు వేసిన ప్రజలకు తలవంపులు తేవొద్దని వారికి హితవు పలికారు.
స్పీకర్ అసహనం
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu).. సభ్యుల హాజరుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఎవరికీ కనబడకుండా దొంగల్లా వచ్చి సంతకాలు చేయాల్సిన కర్మ ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇది వారి గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాథ్ రెడ్డి, విశ్వేశర రాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని స్పీకర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు హాజరు కావాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
జగన్ కూడా అంతే!
బడ్జెట్ సమావేశాలు ప్రారంభోత్సవం సందర్భంగా విపక్ష వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)సైతం సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్.. ఆ తర్వాత కొద్ది సేపు సభలో కనిపించి ఆ వెంటనే వెళ్లిపోయారు. దీనిపై కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనని భయపడి జగన్ అలా సంతకం చేసిన ఇలా వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ నివేదిక
మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సభలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమీషన్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా ఎస్సీ వర్గీకరణను మూడు కేటగిరీల్లో విభజించింది. గ్రూప్ 1, 2,3 కేటగిరీల్లో రెల్లి, మాదిగ, మాల ఉపకులాలను వర్గీకరించింది. ఇవాళ ఆ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు.
Also Read: Banglore News: రోజూ రూ.5000 ఇస్తేనే కాపురానికి సై.. లేదంటే నై నై
కమీషన్ సిఫార్సులు
రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్ ఉంది. ఏ కులానికి ఎంత రిజర్వేషన్ అనే విషయంపై కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రెల్లి కులస్తులకు 1 శాతం, మాదిగ – ఉపకాలాలకు 6.5%, మాల-ఉపకులాలకు 7.5% గా విభజించింది. కాగా, మాల, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారు.