తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : CM Revanth Reddy: బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఆయన కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలను ప్రశంసించడంతో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏమిచ్చిందని విమర్శలు చేస్తూనే, రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారనే విమర్శలు సైతం సీఎం ఇటీవల చేశారు. ప్రధాని మోడీ మంచోడని చెబుతూనే.. కిషన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ప్రశంసించడం గమనార్హం. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, కావాలంటే ఆయన అటు నుంచి తమ వైపునకు రావొచ్చని పరోక్షంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో చివరకు ఏలేటి స్పష్టత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also read: Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ కు సర్వం సిద్ధం.. కేటాయింపులు పూర్తి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరిని తిట్టడం, మరొకరిని పొగడటంతో బీజేపీ నేతల్లో ఇదేం స్ట్రాటజీ అనే కన్ఫ్యూజన్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే కమలం పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.., సీనియర్లపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ సీనియర్లను పాత సామాన్లతో పోల్చారు.
అక్కడితో ఆగకుండా మరో ముందడుగు వేసి ఫాల్తుగాళ్లని విమర్శలు చేశారు. వారు పోతే తప్పా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన ఘాటుగా స్పందించడం గమనార్హం. ఈ తరుణంలో సీఎం కామెంట్లతో కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. వారంతా డైలమాలో పడ్డారు. సీఎం తీరు కారణంగా కమలం కేడర్ అంతా కన్ఫ్యూజన్ లో పడినట్లయింది.
తెలంగాణ బీజేపీ లో కేడర్ మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడాన్ని రేవంత్ అడ్వంటేజీగా మార్చుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసి ఎమ్మెల్యేలను ప్రశంసించి బీజేపీ నేతల మధ్య అగ్గిరాజేయాలని ప్లాన్ చేస్తున్నారా? అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ అస్త్రాన్ని వదులుతున్నారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది.
Also read:Betting Apps: ఆధారాలు సేకరిస్తున్నాం, ఎవ్వరినీ వదిలి పెట్టం.. ఇన్‌ఫ్లూయెన్సర్ల గుండెల్లో వణుకు!
ఎందుకంటే ఇప్పటికే రాజాసింగ్ కు పార్టీలోని సీనియర్లకు మధ్య ఏమాత్రం పొసగడంలేదని ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతోంది. దీన్ని అడ్వంటేజీగా సీఎం మార్చుకుని కమలం పార్టీలో లీడర్, కేడర్ మధ్య చిచ్చు పెట్టినట్లయిందని భావిస్తున్నారు. ఈ అంశం నుంచి కాషాయ పార్టీ ఎలా గట్టెక్కుతుందనేది చూడాలి. నేతల మధ్య సమన్వయం బిల్డ్ చేసుకుని కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.