Telangana Budget Sessions 2025
తెలంగాణ

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ కు సర్వం సిద్ధం.. కేటాయింపులు పూర్తి?

తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: Telangana Budget Sessions 2025 : రానున్న ఆర్థిక సంవత్సరానికి (2025-26) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఉదయం 11.14 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆయన తరపున మంత్రి శ్రీధర్‌బాబు సమర్పించనున్నారు. దాదాపు ఒకటిన్నర నెల రోజులుగా కసరత్తు చేసిన తర్వాత ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌ను కొలిక్కి తెచ్చారు. ముఖ్యమంత్రి సూచనలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గం బుధవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ కానున్నది.

ఆమోదం లభించిన తర్వాత ఉభయ సభల్లో టేబుల్ కానున్నది. బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి తొలుత ఆ ప్రతులను ఆలయానికి వెళ్ళి దేవుడి పాదాల ముందు ఉంచడం ఆనవాయితీ. ఆ ప్రకారమే డిప్యూటీ భట్టి విక్రమార్క సైతం ప్రజాభవన్‌లోని ఆలయంలో పూజలు చేసి అనంతరం అసెంబ్లీకి వెళ్ళనున్నారు. సుమారు గంటన్నరపాటు జరిగే బడ్జెట్ ప్రసంగం తర్వాత గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్ (సామాజిక ఆర్థిక ముఖచిత్రం)ను కూడా ఆర్థిక శాఖ అసెంబ్లీ ముందు ఉంచనున్నది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడుతుంది. బడ్జెట్‌పై చర్చలో పాల్గొనడానికి దాన్ని కూలంకషంగా చదువుకునేందుకు వీలుగా మరుసటి రోజు సమావేశాలకు సెలవు ఇవ్వడం సంప్రదాయంగా కొనసాగుతున్నది.

స్థోమతకు మించి అప్పులు చేసి, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ, సర్కారు సాయంపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. నూతన ఆర్థిక సంవత్సరం (2025-26) కు సంబంధించిన సర్కారు రూపకల్పన చేసిన స్టేట్ బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని కోరుతూ ఇప్పటికే జీహెచ్ఎంసీ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. రానున్న నూతన ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన స్టేట్ బడ్జెట్ ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండటంతో సర్కారు ఏ మేరకు నిధులు కేటాయిస్తుందోనన్న ఉత్కంఠ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల్లో నెలకొంది.

గత ఆర్థిక సంవత్సరం (2024-25) కు సంబంధించి జీహెచ్ఎంసీ రూ.7 వేల కోట్లను ఆర్జిస్తూ ప్రతిపాదనలను పంపినా,సర్కారు మాత్రం అడిగిన నిధుల్లో సగం అంటూ రూ. 3065 కోట్లను కేటాయించింది. అయితే వర్తమాన ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీకి సర్కారు చెల్లించాల్సిన స్టాంట్స్, రిజిస్ట్రేషన్ బకాయిల్లో రూ. 3 వేల 30 కోట్లను చెల్లించినా, అదనంగా మరో రూ. 7208 కోట్లను కేటాయించాలని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. సర్కారు ఏ మేరకు నిధులు కేటాయిస్తుందోనన్న సస్పెన్షన్ మరి కొద్ది గంటల్లోనే వీడనుంది.

ప్రతిపాదనల వివరాలు
జీహెచ్ఎంసీ, సర్కారు ప్రతిపాదనల్లో హైదరాబాద్ నగరంలో చేపట్టనున్న వివిధ రకాల అభివృద్ది పనులకు గాను రూ. 4 వేల కోట్లను, బకాయిగా ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ లో ఏటా చెల్లిస్తున్న రూ. 107 కోట్లను కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా విడుదల చేయాలని, దీంతో పాటువెహికల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.75 కోట్లు, అలాగే డెబ్ట్ సర్వీసు కోసం రూ.1200, స్థల సేకరణకు రూ.200 కోట్లు, క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ గా రూ.వెయ్యి కోట్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో సర్కారు వసూలు చేసుకుంటున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద రూ. 126 కోట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరో రూ. 500 కోట్లతో కలిపి మొత్తం రూ. 7208 కోట్లను కేటాయించాలని సర్కారుకు నివేదికలను పంపినట్లు తెలిసింది.

ఇవే గాక, 2024-25లో హెచ్ సిటీ పనులకు రూ.2654 కోట్లను కేటాయింపులు జరిపినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి అందులో రూ. 726, రూ. 600 కోట్లను రెండు దఫాలుగా మొత్తం 1326 కోట్లను రిలీజ్ చేయగా, మిగిలిన మరో రూ.1328 కోట్లను వార్షిక వాయిదాలుగా చెల్లించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదనల్లో సర్కారును కోరినట్లు తెలిసింది. దీంతో పాటు హెచ్ సిటీ పనులకు గాను సర్కారు రూ. 5942 కోట్లను ప్రకటించి, అందులో కొన్నింటికి పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చినట్లు, ఆ నిధుల మంజూరీని కూడా పరిశీలించాలని కోరినట్లు సమాచారం.

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో..
వర్తమాన ఆర్థిక సంవత్సరం (2024-25)లో జీహెచ్ఎంసీకి రూ. 3065 కోట్లు, జలమండలికి రూ. 3385 కోట్లను కేటాయించటంతో కాస్త ఊరట కల్గించింది. జీహెచ్ఎంసీకి కేటాయించిన రూ.3065 కోట్లను నాలుగు వాయిదాల్లో మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఈ నిధులను ప్రాధాన్యతను బట్టి వివిధ రకాల ప్రాజెక్టులు, మెయింటనెన్స్ కోసం బల్దియా సద్వినియోగం చేసుకోనుంది. జలమండలికి కేటాయించిన రూ.3385 కోట్లలో జలమండలి తాగునీటి సరఫరా మెరుగు, మురుగు నిర్వహణ, ఎస్టీల నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు సమాచారం.

గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ లో రూ.11 వేల 372 కోట్ల కేటాయించగా, సవరించిన బడ్జెట్ లో రూ.7441 కోట్ల కుదించారు. వర్తమాన (2024-25) వర్తమాన ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రూ. 15 వేల 594 కోట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు కేటాయించింది. ఈ శాఖ పరిధిలోకి వచ్చే జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రోరైలు, మూసీ సుందరీకరణ, హైడ్రా తదితర విభాగాలకు మొత్తం 20 వేల కోట్ల కేటాయింపులు జరిపింది.

Also read : MLA Sudheer Reddy: ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు.. మహిళ కార్పొరేటర్ పై ఆ వ్యాఖ్యలేంటి సార్..

గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లో ఈ సంవత్సరం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల పైచిలుకు నిధులతో వివిధ రకాల అభివృద్ది పనులకు నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు రూ.500 కోట్లు, ఏయిర్ పోర్ట్ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు, మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ 1500 కోట్లు, పాత‌బ‌స్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు, మ‌ల్టీ మోడ‌ల్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కు రూ. 50 కోట్లు, ఔట‌ర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించింది. ఈ సారి కేటాయింపులపై ఆయా శాఖలు ఎదురుచూస్తున్నాయి.

ఎన్నికలే టార్గెట్ గా కేటాయింపులుంటాయా?
2026 ఫిబ్రవరి లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో, ఆ తర్వాత ఏడాది కాలంలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీకి నిధుల కేటాయింపులుంటాయా? అన్న చర్చ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అభివృద్దిని పరుగులు పెట్టించాలన్న వ్యూహాంతోనే సర్కారు వర్తమాన సంవత్సరంలో జరిపిన విధంగా వేల కోట్లలో కేటాయింపులు జరిపే అవకాశాలున్నాయి.

Also read : Mlc Jevan Reddy: బీఆర్ఎస్ పాలన.. అంతా అరకొరే
వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో జరిపిన కేటాయింపుల్లో భాగంగా రూ.200 కోట్ల కేటాయించిన హైడ్రాను యాక్షన్ లోకి తీసుకెళ్లటంతో పాటు మూసీ సుందరీకరణ, ప్రక్షాళన పనులను మొదలుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపే ప్రజలకు కన్పించే స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే సర్కారు భారీ కేటాయింపులు జరిపినా,కేటాయింపులకు తగిన విధంగా పనులు మాత్రం జరగటం లేదు. కేటాయింపులో ఎక్కువ శాతం సద్వినియోగం చేసుకోకపోవటంతో వర్తమాన ఆర్థిక సంవత్సరం జరిపిన కేటాయింపులనను సవరించి సర్కారు నిధులు కేటాయిస్తుందా? లేక తాజాగా నిధులు కేటాయిస్తుందా? బుధవారం జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో క్లారిటీ రానుంది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?