కమలాపూర్ స్వేచ్ఛ: Hanamkonda District: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో రైతులు తీవ్రంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. గ్రామానికి చెందిన గుండెల్లిలో సదానందం అనే రైతు తన నాలుగు ఎకరాల భూమిని బావి ఆధారంగా సాగు చేసుకుంటూ వచ్చాడు. గతంలో వేసవి కాలంలోనూ తన 14 గోలల లోతు బావికి సైడ్ బోర్లు వేసుకొని పంటలను సాగుచేశాడు. అయితే, ఈ సంవత్సరం భూగర్భజలాలు మొత్తం తగ్గిపోవడంతో బావిలో తగినంత నీరు లేక పోవడంతో పంట ఎండిపోయింది.
ధర్మసాగర్‌లోని దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా పక్క గ్రామాలకు నీరు అందుతున్నా, రత్నగిరికి మాత్రం నీటి సరఫరా లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందితేనే తమ సాగు కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం, మోసం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెట్టిందని విమర్శలు చేస్తున్నారు.
Also Read: kamareddy: నాగన్న బావి రూపం మారుతోంది..
ఎన్నికలకు ముందు హుస్నాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా అన్ని మండలాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా రత్నగిరి సహా పక్క గ్రామాలకు నీటిని విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాలు తప్పవని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.