ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mulugu Farmers: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో 959 మంది రైతులు సింజంట, మాన్సెంట/బేయర్, హైటెక్, సి పి మల్టీ నేషనల్ కంపెనీల మొక్కజొన్న విత్తనాలతో 2178. 68 ఎకరాల్లో సాగు చేశారు. దాదాపు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో కంపెనీలు హామీ ఇచ్చిన మేరకు దిగుబడి రైతులకు రాలేదు. గత నాలుగేళ్లుగా బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలతో రైతులు సేద్యం చేస్తూ నిండా మునుగుతున్నారు. ఈ ఏడాది కంటే గత ఏడాది రైతులు ఎక్కువగా నష్టపోయినట్లు సమాచారం.
ఈ ఏడాది రైతుల్లో కొంత అవగాహన పెరగడంతో తమకు నష్టం వాటిల్లుతుందని కంపెనీలు చెప్పిన దిగుబడి రావడం లేదని రోడ్డెక్కారు. అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాజేడు వెంకటాపురం కన్నాయిగూడెం తాడ్వాయి మండలాల్లో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుసుకున్న వివిధ శాఖల అధికారులు రైతులు వేసుకున్న పంట క్షేత్రాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఎం ఎన్ సి కంపెనీలు చేస్తున్న మోసాలపై ఆరా తీశారు.
Also Read: KCR: జిల్లాలకు కేసీఆర్.. సిల్వర్ జూబ్లీ సక్సెస్ కోసమేనా?
ఏకంగా ఈ విషయం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం వెళ్లడంతో సీరియస్ అయ్యారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా పరిహారం ఇప్పించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్డిఓ వెంకటేష్ ఆధ్వర్యంలో మల్టీ నేషనల్ కంపెనీల రిప్రజెంటిటివ్స్, ఆర్గనైజర్లు, రైతులతో సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు.
మల్టీ నేషనల్ కంపెనీలు చేస్తున్న మోసాలను పసిగట్టి ఆర్డిఓ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని, రైతులకు నష్టం చేస్తే చర్యలు తప్పని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దిగివచ్చిన కంపెనీల రిప్రజెంటీటివ్స్, ఆర్గనైజర్లు రైతులకు పరిహారం ఇచ్చేందుకు అంగీకార పత్రాలు రాసి ఆర్డిఓ వెంకటేష్ కు సమర్పించారు. సింజంట, హైటెక్, మాన్సెంట/బేయర్, నూజివీడు, పెన్నా కావేరి, సిపి కంపెనీల రిప్రజెంటిటివ్స్, ఆర్గనైజర్లు నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి 70,000 వేల నుండి 80,000 వరకు పరిహారం అందిస్తామని అంగీకరించారు.
959 మంది రైతులు 2178.68 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం కన్నాయి గూడెం తాడ్వాయి మండలాలకు సంబంధించిన 959 మంది రైతులు 2178.68 ఎకరాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాలతో సాగు చేపట్టారు. సాగుచేసిన అన్ని ఎకరాల్లో సరైన దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన బాట చేపట్టారు. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివిధ శాఖల నుంచి రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు జరిగిన నష్టాలపై నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సాగుచేసిన అన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లడంతో రైతులకు ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో అధికారులకు వినతి పత్రాలు, ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.
Uppal Stadium: 23న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. వాటికి నో పర్మిషన్.. సిపి సుధీర్ బాబు
కన్నాయిగూడెం లో 77 మంది రైతులు 190.37 ఎకరాల్లో సింజంట విత్తనాలు, ఐదు మంది రైతులు 9.20 ఎకరాల్లో హైటెక్ కంపెనీ విత్తనాలు, ఆరుగురు రైతులు 13 ఎకరాల్లో బేయర్ కంపెనీ విత్తనాలు, ఒక రైతు ఒక ఎకరంలో కావేరి విత్తనాలతో సేద్యం చేశారు. వాజేడు మండలంలో 45 మంది 142 ఎకరాల్లో సిన్జేంట విత్తనాలు, 30 మంది రైతులు 83 ఎకరాల్లో బేయర్ కంపెనీ విత్తనాలు, 224 మంది 495.22 ఎకరాల్లో హైటెక్ విత్తనాలు, 14 మంది రైతులు 26 ఎకరాల్లో నూజివీడు కంపెనీ విత్తనాలు, ఒక రైతు ఒక ఎకరంలో సిపి కంపెనీ విత్తనాలతో సేద్యం చేశారు.
తాడ్వాయి మండలం లో 16 మంది రైతులు 47.2 ఎకరాల్లో సింజంట విత్తనాలు, ఇద్దరు రైతులు 4.3 ఎకరాల్లో బేయర్ కంపెనీ విత్తనాలు సాగు చేశారు. వెంకటాపురం మండలంలో సిపి కంపెనీ విత్తనాలతో ఇద్దరు రైతులు 3. 2, మాన్సెంట/బేర్ కంపెనీ విత్తనాలతో 26 మంది రైతులు 54. 11 ఎకరాల్లో, హైటెక్ కంపెనీ విత్తనాలతో 170 మంది రైతులు 369.016 ఎకరాల్లో, సిపి కంపెనీ విత్తనాలతో ఇద్దరు రైతులు 2.2 ఎకరాల్లో, పెన్నా కావేరి కంపెనీ విత్తనాలతో ఇద్దరు రైతులు 17.2 ఎకరాల్లో,
సింజంట కంపెనీ విత్తనాలతో 336 మంది రైతులు 718.26 ఎకరాల్లో సేద్యం చేశారు. మొత్తంగా 959 మంది రైతులు 2178.68 ఎకరాల్లో సేద్యం చేయగా దాదాపు అందరికీ తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించి, వారికి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు