AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులపై సుదీర్ఘంగా చర్చ సాగుతున్న సమయంలో, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కాస్త సీరియస్ కామెంట్స్ చేసి, అసెంబ్లీలో తన మార్క్ చూపించారని చెప్పవచ్చు. ఏదో నామమాత్రాన తమ ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయని, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలంటూ కూనం చేసిన కామెంట్స్ పై కాసేపు ఆసక్తికర చర్చ సాగింది. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సారీ చెప్పడం విశేషం.
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరుకాగా, ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. దీనితో కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరవుతున్న పరిస్థితి. శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్న పరిస్థితి ఉండగా, అసెంబ్లీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
శాసనమండలిలో వాడి వేడిగా చర్చలు సాగుతుండగా, అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో సభ ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. ఈ తరుణంలో సోమవారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఉపాధి హామీ పనులపై, వ్యవసాయ శాఖకు సంబంధిత అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇక్కడే ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ జోక్యం చేసుకొని తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు.. ఔనండీ.. కాదండి అంటూ సమాధానాలు వస్తున్నాయని, ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కూన రవికుమార్ మాట్లాడుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే తాను వివరించడం జరిగిందని, పూర్తి నివేదికను సభ్యులకు అందించామన్నారు. పూర్తి నివేదిక చదివేందుకు గంట సమయం పడుతుందన్నారు. ముందుగా ఎమ్మెల్యే రవికుమార్ ఆ విషయాన్ని గ్రహించాలని సూచించారు.
మంత్రి చేసిన కామెంట్స్ పై కూన రవికుమార్ మాట్లాడుతూ.. ఇది తన అభిప్రాయం కాదని, అందరి ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఉందన్నారు. అయితే తాను మంత్రి లక్ష్యంగా కామెంట్స్ చేయలేదని, అసెంబ్లీ సిబ్బంది చేయాల్సిన విధులను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఆరోపించారు.
Also Read: Pawan Kalyan: నేషనల్ పాలిటిక్స్ లోకి పవన్? జనసేనకు కలిసి వచ్చేనా?
వెంటనే జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. ఇప్పటినుండి అటువంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని సభలో సారీ చెప్పారు. ఇలా సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆముదాల వెలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సీరియస్ కామెంట్స్ తో అసెంబ్లీలో కూడా వేడిని పెంచారని చెప్పవచ్చు.