Telangana Govt (image credit:Twitter)
తెలంగాణ

Telangana Govt: కుంభమేళాను తలపించేలా పుష్కర ఏర్పాట్లు.. కృష్ణా, గోదావరి పుష్కరాలపై ప్రారంభమైన కసరత్తు..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Telangana Govt: రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు సన్నద్ధమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం నిర్వహించని విధంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.రాబోయే రెండుమూడేళ్లలో గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్లి విజయవంతం చేయాలని, శాశ్వతంగా ఘాట్లు ఉండేలా చర్యలు చేపడుతుంది.

అందుకోసం రాష్ట్రంలోని 8జిల్లాల్లో 170 స్నానపుఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించనున్నారు.

పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందుకోసం ప్రణాళికలు రూపొందించింది. దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు మౌలిక వసతులు కల్పిస్తుంది. మరోవైపు 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. కృష్ణా పుష్కరాలు 2028లో రానున్నాయి. దీని కోసం ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. దేవాదాయశాఖ, టూరిజంశాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులపై దృష్టిసారించింది.

ఈ పుష్కరాలను విజయవంతం చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనుంది. అంతేకాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు వచ్చేలా ప్రచార సాధ్యమాలతో పాటు డాక్యుమెంటరీలు రూపొందించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.

దేశంలో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా పిలుస్తుంటారు. గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ మనుమల్లోని త్రయంబకం వద్ద జన్మించి.. నాసిక్ మీదుగా ఆ రాష్ట్రంలో ప్రవహించి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని బాసర(కందగట్ల)వద్ద ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుగా ప్రవహిస్తుంది.మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సీలేరు ఉపనదులు ఉన్నాయి.

Also Read: Social Media: ఏపీ దారిలో తెలంగాణ.. ఇక అలా చేస్తే కటకటాలే

ఆదిలాబాద్ తూర్పు సరిహద్దుగా ప్రవహిస్తూ వచ్చే ప్రాణహిత నది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా సరిహద్దులో గోదావరిలో కలుస్తుంది. గోదావరి నది కరీంనగర్ జిల్లా తూర్పు సరిహద్దు వెంబడి కొంతదూరం ప్రవహించి, ఇంద్రావతి నదిని కలుపుకొని వరంగల్, ఖమ్మం జిల్లాల (భద్రాచలం) మీదుగా పాపికొండలు దాటి ఆంధ్రప్రదేశ్ లోని పోలవరంవద్దపీలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో గోదావరి నది 8 జిల్లాల్లో ప్రవహిస్తుంది. నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి.

కొన్ని స్నానపు ఘాట్ల వివరాలు…
1. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ( ములుగు, జయశంకర్ భూపాలపల్లి) మల్లకట్ట, ఏటూరునాగారం, రామగుండం, మంగపేట
2. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని (భద్రాద్రికొత్తగూడెం)లో భద్రాచలం, రామఘట్-పర్నశాల,
3. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(మంచిర్యాల, ఆదిలాబాద్) బాసర, వాస్తాతూర్( లోకేశ్వరం మండలం), సోన్(నిర్మల్)
4. ఉమ్మడి కరీంనగర్ జిల్లా(పెద్దపల్లి, జగిత్యాల) ధర్మపురి, సంతోషిమాత టెంపుల్, మంగటిగడ్డ సోమవిహార్ ఘాట్
5.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (నిజామాబాద్) శివాలయం(త్రివేణి సంగమం)కందకుర్తి, కోస్లి(హనుమాన్ టెంపుల్)

ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలు
రాష్ట్రంలో రాబోయే పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు కుంభమేళా నిర్వహించగా ఈ మేళాకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనే వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్రం నుంచి ఎండోమెంట్, టూరిజం, ఎడ్యూకేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 10మంది అధికారుల బృందం ఈ నెల 1 నుంచి 2వ తేదీవరకు రెండ్రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అక్కడి అధికారులతో నిర్వహించిన భేటీలో సేకరించిన పలువివరాల నివేదికతో పాటు ఎంత బడ్జెట్ అవసరం అవుతుందని కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.

Also Read: SLBC Rescue: టన్నెల్ లో ప్రమాదకర పరిస్థితులు.. రంగంలోకి క్యాడవర్ డాగ్స్.. అసలేం జరుగుతుంది?

యూపీ ప్రభుత్వం భక్తుల కోసం 22 పాంటూన్ కొత్త బ్రిడ్జీలు నిర్మాణం, 13 కిలో మీటర్లు పొడవు ఘాట్ రోడ్డు, కుంభమేళాకు వచ్చే రోడ్ల వెడల్పు, ఎయిర్ పోర్టు నుంచి మార్గం, వాటర్ సివరేజ్ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, టెంట్ సిటీ ఏర్పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు, ఘాట్ల వద్ద బారీకేడ్లు ఏర్పాట్ల వివరాలను నివేదికలో పేర్కొన్నారు.

ఎంతమంది భక్తులు వచ్చారని తెలుసుకోవడం కోసం లెక్కించే మిషన్ లు, వాహనాల కౌంటింగ్ కోసం సైతం మిషన్లు ఖర్చు వివరాలు, దానికి తగినట్టు బడ్జెట్ అంచనాలు వేసినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం రెండేళ్ల ముందుగానే కుంభమేళా ఏర్పాట్లను స్టార్ట్ చేయడంతో తెలంగాణలోనూ అదే విధంగా చేయాలని భావిస్తుంది. ప్రభుత్వం నుంచి సిగ్నల్ రాగానే పుష్కరాలకు పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

తొలుత మహాసరస్వతి పుష్కరాలు
రాష్ట్రంలో ఈ ఏడాది మహాసరస్వతి పుష్కరాలు రానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుంచి26వ తేదీ వరకు 12 రోజుల పాటు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అన్ని శాఖలకు సూచనలు ఇచ్చింది.

పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల ప్రకారం, రూ. 25 కోట్ల మంజూరు చేసింది. అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించగా పనులు సైతం ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం కోసం స్నాన ఘాట్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణ కోసం వినియోగిస్తున్నారు.

పుష్కరం అంటే…
పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దేశంలోని ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి.

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది.

పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు.

బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

Also Read: Meenakshi on Congress: కాస్త ఆగండి.. ఇప్పుడే వద్దు.. ఆ లీడర్స్ కు ఏఐసీసీ, పీసీసీ సూచన

అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

2016లో కృష్ణాపుష్కరాలు..
రాష్ట్రంలో 2016లో ఆగస్టు 12 నుంచి 23 వరకు 12 రోజులపాటు నిర్వహించింది. మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్ మండలంలోని గొందిమళ్ళ లోని జోగుళాంబ వద్ద స్నానం ఘాట్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలకోసం రూ.828.16 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహిస్తున్న తీర ప్రాంతాల్లోనున్న పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. నల్లగొండ తీరంలో 28 స్నానఘట్టాలు, మహబూబ్‌ నగర్‌ తీరంలో 52 స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు.

కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 14 శాఖలు ఈ పుష్కరాల నిర్వహణలో నిమగ్నమయ్యాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతున్న జోగులాంబ దేవస్థానాన్ని ఈ పుష్కరాల సందర్భంగా వైభవోపేతంగా తీర్చిదిద్దారు. కర్ణాటక – తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కృష్ణ గ్రామంలోని శైవక్షేత్రంలో మరమ్మతులు చేశారు. వాడపల్లి సంగమస్థానంలోని నరసింహస్వామి, శైవక్షేత్రాలు, మట్టపల్లి నరసింహస్వామి దేవాలయాన్ని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేశారు.

కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్లకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో తొమ్మిది చోట్ల (కృష్ణా బ్రిడ్జి, పసుపుల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, వాడపల్లి, మటంపల్లి, నాగార్జునసాగర్) సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు