Balineni vs YCP: ఔను.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో సినిమా తీసేందుకు వైసీపీ పెద్ద ప్లాన్ వేస్తోందట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ప్రకాశం జిల్లా వైసీపీ అద్యక్షుడు బూచేపల్లి శ్రీనివాస రెడ్డి. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న బాలినేనితో వైసీపీ సినిమా అంటే ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి.
ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి, వైఎస్సార్ కుటుంబానికి సమీప బంధువు. వైఎస్సార్ ను ఆదర్శంగా తీసుకొని రాజకీయ రంగప్రవేశం చేసిన బాలినేని ఎమ్మెల్యేగా, మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ మరణానంతరం వైసీపీలో చేరి జగన్ వెంట నడిచారు. జగన్ సైతం పార్టీ పదవులతో పాటు, మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు జగన్ పై బాలినేని అలిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. దీనితో ఆ పార్టీ పరిస్థితి కాస్త గడ్డుకాలమేనని చెప్పవచ్చు.
అటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుండి తొలిసారిగా బాలినేని జనసేన దారి పట్టారు. స్వయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ కండువా కప్పి బాలినేనికి వెల్ కమ్ చెప్పారు. అలా జనసేనలోకి అడుగు పెట్టిన బాలినేని పలుమార్లు జగన్, వైసీపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అయితే బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని కొద్దిరోజులు ప్రచారం సాగింది. తాను మాత్రం ఏ పదవి ఆశించి జనసేన లోకి రాలేదని, పవన్ వెంట కార్యకర్త వలె వెంట నడుస్తానని బాలినేని తేల్చి చెప్పారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల పిఠాపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో బాలినేని సైతం పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ బాలినేని మధ్య కాక రేపుతున్నాయి. బాలినేని మాట్లాడుతూ.. తనకు అన్యాయం చేసిన జగన్, తన వియ్యంకుడి ఆస్తులను తీసుకున్నారని ఆరోపించారు. అలాగే పవన్ ను తాను పదవి అడిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, పార్టీలో చేరే సమయంలో కేవలం తనతో ఒక సినిమా తీయాలని అడిగినట్లు బాలినేని తెలిపారు.
ఓ వైపు జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన బాలినేని, మరోవైపు పవన్ ఇచ్చిన సినిమా హామీని బయటకు చెప్పేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ ట్రోలింగ్ చేస్తోంది. పవన్ కంటే బాలినేని మంచి యాక్టర్ అని, తీస్తే సినిమా బాలినేనితో తీయాలన్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పడు ఒకలా, లేనప్పడు మరోలా మాట్లాడడం బాలినేనికే చెల్లుతుందని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.
Also Read: Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కీలక సూచన చేసిన టిటిడి..
అంతేకాకుండా బాలినేని గతంలో మాట్లాడిన మాటలను వైసీపీ ట్రోల్ చేస్తుండగా, బాలినేని మాత్రం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి మాట్లాడడంలో తనకు తానే సాటి అంటూ నిరూపించుకున్న బాలినేని, పిఠాపురం వేదికగా కాస్త ఆవేదనకు లోనయ్యారు. ప్రస్తుతం మాత్రం బాలినేని మాటలను వైసీపీ ట్రోల్ చేస్తుండగా, బాలినేని ఎలా రియాక్ట్ అవుతారన్నది తేలాల్సి ఉంది.