రహానే ఎక్స్ పీరియన్స్ గట్టెక్కిస్తుందా..?
డిఫెండింగ్ చాంపియన్స్ కు కఠిన పరీక్ష
KKR TEAM: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యంత నిలకడగా రాణిస్తున్న సూపర్ టీమ్..మూడు ఐపీఎల్ ట్రోఫీలు కైవసం చేసుకుని .. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంది కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ. ఈ ఏడాది సీజన్ కు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న కోల్ కతా టీమ్ మళ్లీ మేజిక్ చేస్తుందా..? కొత్త కెప్టెన్ రహానే సారథ్యంలో ..కొత్త మెంటార్ డ్వేన్ బ్రావో మార్గదర్శకత్వం.. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వ్యూహాలు.. ఎంత వరకు ఫలిస్తాయి..? వేలంలో దాదాపుగా వారి పాత జట్టును తిరిగి తీసుకువచ్చినట్లుగా కనిపిస్తున్న కేకేఆర్ టైటిల్ నిలబెట్టుకుంటుందా..? ఈ సీజన్ లో వారి జట్టు పరిస్థితి ఎలా ఉంది..? వారి బలాబలాలు ఏమిటో..? ఒక సారి పరిశీలిద్దాం..
డిఫెండింగ్ చాంపియన్ హోదాతో ఐపీఎల్ 2025లో బరిలోకి దిగబోతున్న కేకేఆర్.. తొలి మ్యాచ్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సొంతగడ్డ ఈడెన్ గార్డెన్ లో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య పోరుతో ఈనెల 22న ఐపీఎల్ ఘనంగా ప్రారంభం కానుది. గతంలో గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్ లలో కేకేఆర్ ట్రోఫీ విజేతగా నిలిచింది. మళ్లీ పదేండ్ల తర్వాత గౌతం గంభీర్ మార్గదర్శకంలోనే 2024 పైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన కేకేఆర్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నయ్యర్ తప్పుకోవడంతో ఈ ఏడాది కోల్ కతా ఎలా రాణిస్తుందో అన్న టెన్షన్ నెలకొంది. అంతేకాదు గతేడాది జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ను కోల్ కతా రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్ గా రహానె, కొత్త మెంటార్ గా బ్రావో జట్టును ఎలా నడిపిస్తారో వేచి చూడాల్సిందే. అంతేకాదు వేలంలో కాస్త కొత్త తరహా జట్టుతో ఈ సీజన్ లో కేకేఆర్ ఆడనున్నది.
బలాలు
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. జట్టులో నలుగురు ప్రధాన బ్యాటర్లు కెప్టెన్ రహానె, అంగ్ క్రిష్ రఘువన్షి, మనీష్ పాండె, రింకూ సింగ్ ఉన్నారు.
ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, మోయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్, రోవ్ మన్ పావెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఏడుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. ఇక డికాక్, గుర్బాజ్, సిసోడియా వికెట్ కీపర్లు కాగా..నోకియా, రాణా, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా పేసర్లు కాగా.. మయాంక్ మర్కండే, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లు.
జట్టులో కీ ప్లేయర్స్..
వరుణ్ చక్రవర్తి: చాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో చెలరేగిన వరుణ్ చక్రవర్తి కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాంపియన్స్ ట్రోఫీ విజయంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అంతేకాదు నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి కేకేఆర్ విజయాల్లో వరుణ్ ఈ సీజన్‌లో కీలక పాత్ర పోషించడం ఖాయం.
సునీల్ నరైన్: కరేబియన్ ఆల్ రౌండర్ గత సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్నాడు. తన వైవిధ్యమైన బౌలింగ్ తో నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 180 కి పైగా స్ట్రైక్ రేట్ తో 34.85 సగటుతో 488 పరుగులు చేసాడు. అతని ఆల్ రౌండ్ సామర్థ్యమే కేకేఆర్ ను చాంపియన్ గా నిలిపింది. అప్పటి మెంటార్ గంభీర్ కారణంగానే తాను బ్యాటింగ్ లో ఇరగదీసిన కారణమని నరైన్ కూడా చెప్పడం విశేషం. మరి ఈ ఏడాది ఇదే తరహాలో చెలరేగుతాడేమో చూడాల్సిందే.
ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్.. దశాబ్ద కాలంగా కరేబియన్ ఆల్ రౌండర్ కేకేఆర్ జట్టులో న కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత సీజన్ లో నూ రస్సెల్ ఆల్ రౌండ్ నైపుణ్యం జట్టుకు ట్రోఫీని అందించింది. రస్సెల్ 180 స్ట్రైక్ రేట్ తో 222 పరుగులు చేసి బౌలింగ్ లో 19 వికెట్లు పడగొట్టాడు. నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.
కోల్‌కతాకు 7 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి .మొత్తంగా కేకేఆర్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండడం ఆ జట్టుకు అదనపు బలంగా మారింది. వైభవ్ అరోరా, నోకియా కొత్త బాల్‌తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయనున్నారు. పవర్ ప్లే తర్వాత హర్షిత్ రాణా, సునీల్ నరైన్ దిగుతారు. వారి ఎకానమీ రేటు కూడా అత్యుత్తమంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదం చేశారు. రస్సెల్, రింకూ సింగ్, రమణ్ దీప్‌లతో కూడిన ఫినిషర్స్ మిగిలిన ఏ జట్లలోనూ కనిపించడం లేదు.
బ్యాటింగ్ లో ఓపెనర్లుగా నరైన్, డికాక్ ..వన్ డౌన్ లో రహానె, రఘువన్షి, వెంకటేశ్ అయ్యర్.. ఆరోస్థానంలో రింకూ, ఏడో స్థానంలో రస్సెల్, 8వ స్థానంలో రమణ్ దీప్, 9వ స్థానంలో హర్షిత్ రాణా..అంటే వీరి బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందో తెలుస్తోంది. జట్టులో రస్సెల్, రింకూ, రమణ్ దీప్ విధ్వంసం ముందు ఎలాంటి బౌలరైనా ఎదురు నిలవడం అసాధ్యం..
బలహీనతలు: గతంలో మెంటార్ గా గంభీర్, బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నయ్యర్ ఉండడంతో వారికి కలిసి వచ్చింది. తాజా సీజన్ లో రస్సెల్, నరైన్ ఎలా ఆడురాన్నది ప్రశ్న. ఇక డికాక్ లో మునుపటి మెరుపులు కనిపించడం లేదు. ఇక నోకియా ఎలా రాణిస్తాడో..? స్టార్క్ ప్లేస్ లో వచ్చిన జాన్సన్ ఏం చేస్తాడో తెలియదు. అంతేకాదు జట్టుగా వీరంతా గతేడాది మాదిరిగా చెలరేగుతారన్న గ్యారంటీ లేదు. రహానె కెప్టెన్ గా మంచి రికార్డున్నా.. టీ20ల్లో మాత్రం అతని వేగం తక్కువే. అంతేకాదు గతేడాది చెన్నై తరఫున బాగా ఆడడంలోనూ రహానె విఫలమయ్యాడు. దేశవాళీలో కెప్టెన్ గా అదరగొట్టినా.. ఐపీఎల్ లో ఎలా రాణిస్తాడో.. జట్టును ఎలా నడిపిస్తాడో అనుమానమే. ఇక ఫిట్ నెస్ సమస్యలు లేకుండా ఉంటేనే జట్టు ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఎందుకంటే వీరికి బ్యాకప్స్ కనిపించడం లేదు.