Indian Cricketers: వైట్ బాల్ క్రికెట్ లో పరుగులు నియంత్రించడంలోనే బౌలర్ ప్రతిభ తెలుపుతుంది. ఇక కీలకమైన ఫైనల్స్ లో ఎవరి జట్టులో పరుగులు ఎక్కువ ఇవ్వని పిసినారి బౌలర్లుంటారో వారి జట్టుదే టైటిల్ అంటే అతిశయోక్తి కాదు.
ఒక్క ఓటమి లేకుండా.. చాంపియన్స్ ట్రోఫీలో అదిరిపోయే ఆటతీరుతో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మన బౌలర్లు నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టును 251/7 కే నియంత్రించారు. మనోల్లు 49 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుని చాంపియన్లుగా నిలిచారు.
మన బౌలర్లు ప్రత్యేకంగా చెప్పాలంటే మన స్పిన్నర్లు టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించారు. ఫైనల్లో వరుణ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు సాధించగా..రవీంద్ర జడేజా ఒకే వికెట్ తీసుకున్నాడు. అయితే అతను మాత్రం ఫైనల్లో టీమిండియా బౌలర్లలో తక్కువ ఎకానమితో బౌలింగ్ చేయడం విశేషం.
ఇలా గతంలోనూ మనం సాధించిన ఐసిసి ట్రోఫీల ఫైనల్స్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో (10 ఓవర్లు లేదా అంతుకుమించి) టాప్ 5లో రవీంద్ర జడేజా కూడా చోటు చేసుకోవడం విశేషం.
మన క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చేసిన అద్భుతమైన పీనాసి బౌలింగ్ గణాంకాలపై ఓ లుక్కేద్దాం..
టాప్ 1లో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కొనసాగుతున్నాడు. 1983 ప్రపంచకప్ అందించిన ది గ్రేట్ కపిల్ ..అలనాటి వెస్టిండీస్ జట్టుపై ఫైనల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేసాడు. కపిల్ దేవ్ 11 ఓవర్లలో 1.90 ఎకానమీతో కేవలం 21 పరుగులే ఇచ్చాడు. ఇందులో 4 మెయిడెన్స్ కాదా.. అతను అప్పటి గ్రేట్ ఆండీ రాబర్ట్స్ వికెట్ పడగొట్టాడు. మనం ఆడిన ఐసిసి ఫైనల్స్ లో కపిల్ వేసిన ఈ స్పెల్ అత్యంత పొదుపు బౌలింగ్ కావడం విశేషం.
ఇక టాప్ 2లో 1983 ప్రపంచకప్ లో ఆడిన క్రికెట్ దిగ్గజం ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఉన్నాడు. అంతేకాదు వరుసగా రెండు ప్రపంచకప్ లు గెలిచిన వెస్టిండీస్ గ్రేట్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ వికెట్ అందించాడు. తను వేసింది 10 ఓవర్లు. ఎకానమీ 2.58. ఇచ్చింది కేవలం 23 పరుగులు మాత్రమే. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. 183 పరుగుల విజయలక్ష్యం కాపాడే ప్రయత్నంలో అతను చాలా పొదుపుగా బౌలింగ్ చేసి తొలి ప్రపంచకప్ విజయంలో తనవంతు పాత్రను అద్భుతంగా పోషించాడు.
ఇక 1983 ప్రపంచకప్ ఫైనల్ ఆడిన దిగ్గజ ఆల్ రౌండర్ మదన్ లాల్ టాప్ 3 లో నిలిచాడు. ఈ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో అతనిదే కీలకపాత్ర. 12 ఓవర్ల స్పెల్ లో 2.58 ఎకానమీతో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. విండీస్ గ్రేట్ వివియన్ రిచర్డ్స్ వికెట్ పడగొట్టింది మదన్ లాల్ కాగా..వెనక్కి పరుగెడుతూ కపిల్ పట్టిన ఈ క్యాచ్ మనకు ప్రపంచకప్ అందించింది. అంతేకాదు డెస్మండ్ హేన్స్, లారీ గోమ్స్ వికెట్లు పడగొట్టడంతో విండీస్ బ్యాటింగ్ కుదేలైంది.
ఇక 2002లో మనం శ్రీలంకతో కలిసి చాంపియన్స్ ట్రోఫీ సంయుక్త విజేతలుగా నిలిచాం. అప్పుడు ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 244/5 పరుగులు చేసింది. వర్షంతో ఫైనల్ పూర్తి కాకపోవడంతో నిబంధనల ప్రకారం రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. ఈ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ 10 ఓవర్లలో 2.70 ఎకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. ఒక మెయిడిన్ ఓవర్ సంధించిన హర్భజన్ 3 వికెట్లు (ఆటపట్టు, కుమార సంగక్కర, అరవింద డిసిల్వ) తీసుకున్నాడు. ఇది అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన స్థానాల్లో టాప్ 4లో నిలిచింది.
ఇక టాప్ ఫైవ్ లో రవీంద్ర జడేజా నిలిచాడు. దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ఫైనల్లో జడేజా 10 ఓవర్లలో 3.00 ఎకానమీతో బౌలింగ్ చేసి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసి మనకు విజయాన్నందించడంలో జడేజా బౌలింగూ కారణమే. అంతేకాదు కీలకమైన టామ్ లేథమ్ వికెట్ ను పడగొట్టాడు. తద్వారా ఐసిసి టోర్నీ ఫైనల్స్ లో పొదుపైగా బౌలింగ్ చేసిన టాప్ 5 బౌలర్ గా జడేజా నిలిచాడు.