IMD Cyclone Alert: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మద్యాహ్నం అయితే చాలు రహదారులు.. అట్ల పెనాన్ని తలపిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా కాస్తున్న ఎండతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (IMD) ఆశ్చర్యకర ప్రకటన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ ప్రజలను అప్రమత్తం చేసింది.
వర్షాలు ఎక్కడంటే..
దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department)భారీ వర్ష సూచన చేసింది. అసోం, మేఘాలయా, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గురు, శుక్ర, శని వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు అధికారులు సైతం భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అటు కేరళను సైతం ఐఎండీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు మలప్పురం, వయనాడ్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
చెన్నైకు బిగ్ అలెర్ట్
తమిళనాడుకు సైతం ఆ రాష్ట్ర ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) భారీ వర్ష సూచన చేసింది. దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తెన్కాసి, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మంగళవారమే (మార్చి 11) హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని చెన్నైలో మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని RMC స్పష్టం చేసింది.
Also Read: Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ రాష్ట్రాలకు సైతం..
అసోం, మేఘాలయా, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సహా దేశంలోని 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతారవరణ విభాగం తాజాగా హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, బిహార్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో మార్చి 11 నుంచి 15 తేదీల మధ్య హెవీ రెయిన్స్ కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో తాజాగా ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఈ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది.
మనకి చల్లని కబురు లేనట్లే
అయితే ఐఎండీ హెచ్చరించిన భారీ వర్ష సూచన ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు లేవు. దీంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఉక్కపోతను భరించాల్సిందే. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో 42-45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.