Man Attacks on School: బిహార్ లో అదొక ఫేమస్ స్కూల్. పాఠశాలలో పిల్లలు శ్రద్ధగా పాటలు వింటున్నారు. టీచర్లు ఎంతో ఆసక్తిగా విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి స్కూల్ బయట పెద్ద పెద్ద శబ్దాలు రావడం మెుదలయ్యాయి. కొందరు దుండగులు విచక్షణ రహితంగా స్కూలుపై దాడికి తెగపడ్డారు. రాళ్లు, నాటు బాంబులతో స్కూల్ ఎదుట బీభత్సం సృష్టించారు. అయితే అందుకు గల కారణం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ హాజీపుర్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌పై ఇటీవల కొందరు దుండగులు దాడికి యత్నించారు. మరణాయుధాలతో వచ్చిన ఆ మూక.. రాళ్లు, నాటు బాంబులతో పాఠశాల ఎదుట తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించి గతంలో తమ స్కూల్లో పనిచేసిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసింది. డ్రైవర్ ఉద్యోగం నుంచి తీసివేయడంతో అతడే ఈ దాడికి పాల్పడి ఉంటాడని స్కూలు యాజమాన్యం బిహార్ పోలీసులకు తెలియజేసింది.
Read Also: Tariff Cuts: ట్రంప్ బాటలోనే భారత్.. సుంకాల విధింపులో తగ్గేదేలే.. తేల్చేసిన కేంద్రం
నెటిజన్ల మండిపాటు
బిహార్ స్కూల్ పై దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో అవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు చదువుకునే స్కూల్ ఎదుట ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడుతున్నారు. స్కూల్ విద్యార్థులకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీడియో పెద్ద ఎత్తున షేర్ అవుతుండటంతో బిహార్ పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.