police collects key evidence in phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన ఆధారాలు సేకరించారు. ప్రణీత్ రావు దర్యాప్తునకు తొలుత సహకరించనప్పటికీ తర్వాత వివరాలు వెల్లడించారని భుజంగరావు, తిరుపతన్నల రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ రావు ముఖ్యమైన విషయాలను పోలీసులకు వెల్లడించినట్టు తెలిసింది. హార్డ్ డిస్కులను డిసెంబర్ 4న మూసీలో పడేసినట్టు ప్రణీత్ రావు చెప్పగతా.. ఆయనను మూసీ వద్దకు తీసుకెళ్లి నాగోలు సమీపంలో మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేస్‌లు, మెషీన్‌తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు, 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలనూ స్వాధీనం చేసుకున్నారు.
ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే ఎస్ఐబీ ఆఫీసులోనూ పలు ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసు ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్‌లనూ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. సీసీఫుటేజీ లాగ్ బుక్ ప్రతులనూ సేకరించారు.
ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేశ్ గౌడ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. విపక్షాల అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్టు ఎస్ఐబీ కానిస్టేబుల్ వెల్లడించారు. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ ముగియడంతో వీరిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరద్దరిని ఏప్రిల్ 6వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దర్యాప్తులో ప్రణీత్ రావు వెల్లడించిన వివరాలను ఆధారం చేసుకుని భుజంగరావు, తిరుపతన్నలను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.