Chiru – Sreeleela: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. సంక్రాంతికి విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ విషయంలో వచ్చిన కంప్లయింట్‌తో వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు అనుకున్న విడుదల తేదీని ‘గేమ్ చేంజర్’కు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరిలో విడుదల అనుకున్న ఈ మూవీకి.. ఫిబ్రవరి, మార్చి వచ్చినా కూడా ఇంకా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో విడుదల తేదీ విషయంలో రకరకాల వార్తలతో ఈ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read- Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్
శ్రీలీల ఏంటి? ‘విశ్వంభర’ సినిమా సెట్స్‌లో ఏంటి? అనుకుంటున్నారా? ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ‘విశ్వంభర’ సినిమా షూట్ పక్కనే శ్రీలీల నటిస్తోన్న మరో సినిమా షూట్ కూడా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కనే ఉన్న సెట్స్‌లో ఉన్నారని తెలుసుకున్న శ్రీలీల, తన అభిమాన నటుడిని చూసేందుకు ఆ సెట్స్‌కి వెళ్లారు. శ్రీలీల (Sreeleela) తన కోసం వచ్చిందని తెలిసి వెంటనే చిరంజీవి కూడా ఆమెను ఆహ్వానించారు. ఇక ఇదంతా మహిళా దినోత్సవం రోజున జరగడంతో, వెంటనే శ్రీలీలను శాలువాతో సత్కరించి, దుర్గాదేవి రూపం ముద్రించిన వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని బహుకరించారు. ఈ విషయం స్వయంగా శ్రీలీల తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేసింది. చిరంజీవి తనని సత్కరించిన ఫొటోలను పోస్ట్ చేసిన శ్రీలీల, తను ఎంత సంతోషంగా ఫీలయిందో చెప్పుకొచ్చింది.
‘‘విత్ ఓజీ.. సిల్వర్ స్క్రీన్‌పై మనమెంతగానో ఆదరించే మన శంకర్‌దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం స్పెషల్‌గా ప్రత్యేక బహుమతి. మీ విషెస్‌కు థ్యాంక్యూ. రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు’’ అని శ్రీలీల తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తూ, అదిరా మా బాస్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలను చూసిన వారంతా, విషయం తెలియక.. శ్రీలీల కూడా ‘విశ్వంభర’లో నటిస్తుందా? అనేలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘విశ్వంభర’ విషయానికి వస్తే, చిరంజీవి కెరీర్‌లోనే దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: నా డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్