Chiranjeevi: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day) పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వీడియోను చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు ఆయన మదర్ అంజనమ్మ, బ్రదర్ నాగబాబు, సిస్టర్స్ విజయ దుర్గా, మాధవిలు ఉన్నారు. వీరంతా వారి చిన్నప్పటి విషయాలను తల్లి అంజనమ్మ సమక్షంలో నెమరువేసుకున్నారు. అంజనమ్మ కూడా తన పిల్లల చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. పిల్లలని క్రమశిక్షణతో పెంచిన విధానం, ఉమ్మడి కుటుంబ విలువలు వంటి ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా మెగా మహిళా కుటుంబం పేరుతో వచ్చిన ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా తన డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ విషయంలోకి వస్తే..
‘‘అమ్మ విజయని డాన్స్ క్లాసులకి పంపించేది. నేనే ఆమెని డ్యాన్స్ క్లాసులకి తీసుకెళ్లేవాడిని. ఆమె నేర్చుకోలేదు, కానీ ఆమెని తీసుకెళ్తూ నేను నేర్చుకున్నాను. ఒక విధంగా, నేను డ్యాన్స్ విషయంలో స్టార్ అవ్వడానికి విజయనే కారణం. ఆ క్లాసుల్లో పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ నేర్చుకునేవాడిని. ఆ స్టెప్స్ నాకు ఇంకా గుర్తున్నాయి..’’ అని మెగాస్టార్ తెలిపారు. దీంతో మెగాభిమానులు అందరూ ఆయన సోదరి విజయ దుర్గాకు థ్యాంక్స్ చెబుతున్నారు. మీ వల్లే మెగాస్టార్‌కు డ్యాన్స్‌లో బీజం పడిందని, ఆయన స్టార్‌గా మారడానికి మీకు కూడా క్రెడిట్ వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..
Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?
‘‘ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత వంటి విలువలన్నీ కూడా మాకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం, అయినా ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. మా అమ్మ సైడ్ ఫ్యామిలీ వాళ్లని కూడా చూసుకున్నారు. అలాగే అమ్మ కూడా మా నాన్న గారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి అలవడ్డాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగానే ఉంటాం. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను. ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో మేము అందరి కంటే ధనికులం అని. ఒక్కోసారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా విలువకట్టలేనివి. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. అందరం నిలబడతాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలనే మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వచ్చారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది.
ఎవరికైనా సరే మా కుటుంబంలో కష్టం వచ్చిందని తెలిస్తే అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతోనే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు ఇంట్లో పనులు అస్సలు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు, పోరాటాలు చేసి బాగా కష్టపడుతున్నాడు, బిడ్డ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి.. తను ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెట్టేది. కళ్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది. నా నిర్ణయానికి మా అమ్మానాన్నలు గౌరవం ఇచ్చేవారు.. కాకపోతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛని ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ రోజుకీ మేమంతా ఇలా కలిసి ఉన్నామంటే మా అమ్మే కారణం’’ అని ఈ వీడియోలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?
Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?