Israeli Women Gang Raped: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల్లో ఇజ్రాయిల్ కు చెందిన మహిళ ఉండటం మరింత సంచలనం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. అత్యాచారం చేసిన వారిలో తెలుగు మాట్లాడే వ్యక్తి ఉన్నట్లు బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే
కర్ణాటక కొప్పాల్ లోని సనాపూర్ లేక్ వద్ద గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులైన ఇజ్రాయిల్ మహిళ, ఓ హోమ్ స్టే ఓనర్ తో పాటు ముగ్గురు పురుష పర్యాటకులు డిన్నర్ ముగించుకొని చెరువు వద్దకు వచ్చారు. అక్కడ ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఇంతలో ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. చెరువు వద్ద ఎంజాయ్ చేస్తున్న పర్యాటకుల వద్ద వాహనాన్ని ఆపారు. పెట్రోల్ ఎక్కడ లభిస్తుందని అడిగారు. అయితే దగ్గర్లో పెట్రోల్ బంక్స్ లేవని బాధిత మహిళ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో నిందితులు రూ.100 ఇవ్వాలని పర్యాటకులను పట్టుబట్టారు.
చెరువులో తోసేసిన దుండగులు
ఇజ్రాయిల్ మహిళతో పాటు మగ టూరిస్టులు నిందితులకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో నిందితుల్లో ఒకరు కన్నడ – తెలుగు భాషల్లో మాట్లాడుతూ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ముగ్గురు మగ పర్యాటకులను చెరువులోకి తోసేశారు. ఆపై తమపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులోకి తోయబడ్డ పర్యటకుల్లో అమెరికాకు చెందిన డేనియల్, నాసిక్‌కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు వ్యక్తులు చెరువు నుంచి ప్రాణాలతో బయటపడగా బిబాస్ మృతదేహాన్ని పోలీసులు తాజాగా వెలికితీశారు.
Also Read: Gold Rate Today: ఉమెన్స్ డే రోజునా కరుణించని బంగారం.. భారీగా పెరిగిన ధరలు
నిందితుల గుర్తింపు
అత్యాచారానికి గురైన ఇజ్రాయిల్ స్త్రీతోపాటు మరో మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు కొప్పాల్ ఎస్పీ రామ్ అరసిద్ధి తెలిపారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం క్లూస్ టీమ్ అన్ని ఆధారాలను సేకరించినట్లు పోలీసు అధికారి తెలిపారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై రేప్, గ్యాంగ్ రేప్, దొంగతనం, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు ప్రత్యేక బృందాలు ఈ అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.