PM Modi Womens Day: ప్రతీ మగాడి విజయం వెనక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య ఇలా ఏదోక స్త్రీశక్తి ఉండే ఉంటుంది. రోజూ వారి జీవితంలో వారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి సేవలకు గుర్తుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని యావత్ ప్రపంచం సంబురాల్లో మునిగిపోయింది.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్త్రీ శక్తిని గౌరవిస్తూ ఉమెన్స్ డే సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విషెస్ తో పాటు వినూత్న నిర్ణయం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day) పురస్కరించుకొని దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నారీశక్తికి వందనం’ అంటూ విష్ చేశారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్రం లోని భాజపా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల సాధికారత కోసం పలు అభివృద్ధి పథకాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని సైతం ప్రధాని పంచుకున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తారని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను సైతం ప్రధాని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
We bow to our Nari Shakti on #WomensDay! Our Government has always worked for empowering women, reflecting in our schemes and programmes. Today, as promised, my social media properties will be taken over by women who are making a mark in diverse fields! pic.twitter.com/yf8YMfq63i
— Narendra Modi (@narendramodi) March 8, 2025
పూర్తిగా మహిళలతోనే భద్రత
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుజరాత్ లో కేంద్రం ప్రభుత్వం ఇవాళ ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుజరాత్ (Gujarat)లోని నవ్ సారీ (Navsari) జిల్లాలో కాసేపట్లో వేడుక జరగనుంది. దీనికి ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ప్రధాని పాల్గొనే ఉమెన్స్ డే ఈవెంట్ కు మహిళా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి (Harsh Sanghavi) తెలిపారు. ప్రధాని దిగే హెలిప్యాడ్ నుంచి వేదిక వరకూ భద్రతా ఏర్పాట్లను మహిళా సిబ్బందే చూసుకుంటారని ఆయన వెల్లడించారు.
#WATCH | Gujarat: Women police officials take charge of the security arrangements of the Lakhpati Didi Program in Navsari, where PM Modi will participate today. pic.twitter.com/CRX6MrJDMk
— ANI (@ANI) March 8, 2025
2,300 మంది మహిళలు పహారా
ఉమెన్స్ కార్యక్రమానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. 2,300 మందికి పైగా మహిళా పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుళ్ల వరకూ అందరూ మహిళా పోలీసులే ఉండనున్నట్లు తెలిపారు. మెుత్తం భద్రతా సిబ్బందిలో 2,100 మందికిపైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది సీఐలు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ఉంటారని హోంమంత్రి వివరించారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోంశాఖ కార్యదర్శి నిపుణా తోరావణే ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు హోంమంత్రి చెప్పారు.