– ఎన్నికలకు సై అంటున్న హస్తం
– అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
– ఫైనల్ లిస్ట్ కోసం సీఈసీ మీటింగ్
– హైకమాండ్‌తో సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ చర్చలు
– కడియం కావ్యకు వరంగల్ సీటు
– ఖమ్మం సీటుపై తీవ్ర కసరత్తు
Congress Final List Of Candidates For Telangana: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం సోమవారం సాయంత్రం ఢిల్లీలో ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరఫున లోక్ సభలో బరిలో నిలవనున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నియోజకవర్గాలకు రాష్ట్ర కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల నేపథ్యాలను పలు కోణాల్లో పరిశీలించిన కేంద్ర కమిటీ అంతిమంగా అభ్యర్థులపై ఓ క్లారిటీకి వచ్చింది.
వరంగల్ టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కెటాయించారు. ఖమ్మం సీటుకు ప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, యుగంధర్ పోటీ పడుతున్నారు. అయితే, తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు సమాచారం. కరీంనగర్ స్థానానికి తీన్మార్ మల్లన్న, ప్రవీణ్‌రెడ్డి, మరో మాజీ మంత్రి పేర్లను కమిటీ పరిశీలించింది. హైదరాబాద్ అభ్యర్థిగా మైనార్టీ లేదా బీసీ వర్గానికి చెందిన నేత పేర్లను పరిశీలించింది.
Read Also: ఎంపీ ఎన్నికల్లో ముందు వీళ్లను ఓడించాలే.. రగులుతున్న బీఆర్ఎస్
తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకుగానూ ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం.. పోటీ ఎక్కువగా ఉన్న ఈ నాలుగు స్థానాలను గతంలో పెండింగ్ పెట్టటమే గాక ఈ స్థానాలపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాన్ని కోరింది. ఇప్పుడు వాటిపై క్లారిటీ రావడంతో ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఖమ్మం సీటుపై కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. సోమవారం సాయంత్రం వరకు సీఎం రేవంత్, భట్టితో చర్చలు జరిగాయి.