ఆ నాయకులు గతంలో కూడా పార్టీలు మారారు. పార్టీ మారే బీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత రూలింగ్ పార్టీలోకి జంప్ అయ్యారు. అసలే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో సతమతం అవుతున్న గులాబీ పార్టీకి.. నమ్మిన నాయకులు దూరం కావడం దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు శాతం గణనీయంగానే ఉన్నదని, పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిన్నా మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుని తమ సత్తా చూపించాలని అనుకున్నారు. కానీ, నమ్ముకున్న నాయకులు హ్యాండ్ ఇస్తుండటంతో రగిలిపోతున్నది.
ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలు హ్యాండ్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీలో సదవకాశాలను పొందిన ఈ సీనియర్లు అదే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట ఉండి నిలబెట్టకుండా జంప్ కావడంపై మండిపడుతున్నాయి. అభ్యర్థిగా ప్రకటించాక మరీ.. పార్టీ టికెట్ వద్దంటూ కడియం శ్రీహరి కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే ముఖ్యంగా వరంగల్ బీఆర్ఎస్ కీలక నాయకులు కడియం పై తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వరంగల్‌లో బీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా సరే కడియం శ్రీహరిని ఓడించి తీరుతామని అన్నారు. ఈ ఎన్నికలతో రాజకీయ సన్యాసం తీసుకునేలా చేస్తామని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు ఇష్టం లేకున్నా బ్రతిమాలి తానే టికెట్ ఇప్పించానని, మంత్రి పదవి కూడా కడియంకు తన వల్లే దక్కిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కడియం శ్రీహరిని ఓడించడంలో తానే ముందుంటానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పార్టీ ఫిరాయింపులను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ‘అసలు ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఉన్నదా? ఒక పార్టీ టికెట్ పై గెలిచి మూడు నెలల్లోపే పార్టీ మారుతుంటే ఎన్నికల సంఘం, స్పీకర్ ఏం చేస్తున్నారు? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఎన్నికల సంఘం, అసెంబ్లీ స్పీకర్ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారా? ఇది వారి బాధ్యత నిర్వర్తనలో నిర్లక్ష్యం కాదా? పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రకారం వెంటనే దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై చర్యలు తీసుకోవాలని ఈసీని, స్పీకర్‌ను డిమాండ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేసింది.
లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉన్నది. ఈ నేపథ్యంలోనే సత్తా చాటాలని చతికిలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ.. నమ్మకద్రోహులపై ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నదని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్నది.