Vijay: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఈ పునర్విభజనలోని లోపాలను ఎత్తిచూపుతూ తీవ్రంగా మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రానికి చెందిన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్.. కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్ సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకు అంగీకరించం: విజయ్
వచ్చే ఏడాది కేంద్రం చేపడతామంటున్న లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజనపై రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని తాజా ప్రకటనలో విజయ్ డిమాండ్ చేశారు. లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన చేయాడాన్ని తాము ఏమాత్రం అంగీకరించబోమని చెప్పారు. తమిళనాడు సహా పలు దక్షిణాది రాష్ట్రాలు గత 50 ఏళ్లుగా జనాభా పెరుగుదలను నియంత్రించాయని అన్నారు. ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని పునరుద్ఘటించారు.
‘ఇతర సమస్యలు పట్టించుకోండి’
కేంద్రం చర్యలతో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశముందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాధి రాష్ట్రాల్లో గణనీయంగా సీట్లు పెరుగుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజక వర్గాల సంఖ్య తగ్గినా.. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని విజయ్ తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధుల కొరత సామాన్యులకు అసలు సమస్యే కాదన్న ఆయన దేశాన్ని పీడిస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి సమస్యలపై దృష్టి సారించాలని కేంద్రానికి హితవు పలికారు.
కమల్ సైతం విమర్శలు
మరోవైపు నటుడు, మక్కల్ నీధి మయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని ‘హిందీయా’గా మార్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దడం సమాఖ్య సూత్రాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘హిందీయాను తయారు చేయాలనుకుంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం హిందీయేతర రాష్ట్రాలకు అనుకూలంగా లేదు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఈ విధానం అనవసరం’ అని కమల్ హాసన్ అన్నారు.