Steven Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. గాయం కారణంగా ఆసీస్ రెగ్యులర్ సారథి ప్యాట్ కమ్మిన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన స్మిత్ కు ఆసీస్ బోర్డు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో జట్టును సెమీస్ కు తీసుకొచ్చిన స్మిత్.. టీమిండియాతో జరిగిన కీలకమైన పోరులో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. దుబాయి వేదికగా మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆసీస్ జట్టు దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో స్మిత్ వన్డే ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నా: స్మిత్
తన రిటైర్మెంట్ ప్రకటనలో ఆసీస్ జట్టుతో తనకున్న అనుబంధాన్ని స్మిత్ గుర్తుచేసుకున్నారు. ‘ఈ గొప్ప ప్రయాణంలో ప్రతీ ఒక్క క్షణాన్ని ఆస్వాదించా. జట్టుతో ఎన్నో అద్భుతమైన సమయాలను గడిపా. ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నా. 2027 వన్డే ప్రపంచకప్ కోసం కొత్తవారిని సిద్ధం చేసేందుకు ఇది సరైన సమయం. వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ షిప్, ఇంగ్లాండ్ – వెస్టిండీస్ లతో జరగబోయే టెస్టు సిరీస్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని స్మిత్ అన్నారు. అయితే వన్డేలకు మాత్రమే తను రిటైర్మెంట్ ఇచ్చానన్న స్మిత్.. 2028 వరకూ క్రికెట్ లో తన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read: Tariffs: భారత్ పై ట్రంప్ ‘తగ్గేదేలే’.. ఏప్రిల్ 2 నుంచి గెట్ రెడీ
స్మిత్.. వన్డే కెరీర్
స్టీవ్ స్మిత్ వన్డే కెరీర్ గొప్పగా సాగింది. 2010 ఫిబ్రవరి 19న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో స్మిత్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున మెుత్తం 169 వన్డేలు ఆడిన స్మిత్.. 43.06 సగటుతో 5727 పరుగులు సాధించాడు. ఇందులో 164 పరుగులు అత్యధిక రన్స్ గా ఉంది. వన్డేల్లో ఓవరాల్ గా 34 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలను స్మిత్ నమోదు చేశాడు. 517 ఫోర్లు, 57 సిక్సులు బాదాడు. అటు బౌలింగ్ లోనూ ప్రతిభ కనబరిచిన స్మిత్.. మెుత్తంగా 28 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు ఆసీస్ కు కెప్టెన్ గాను వ్యవహరించిన స్మిత్.. జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత్ పై స్మిత్ కు మంచి రికార్డు ఉంది.