Himani Narwal Murder: హర్యానాకు చెందిన యువ కాంగ్రెస్ నేత హిమానీ నర్వాల్ హత్య కేసు ఉదంతం యావత్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెను దారుణంగా హత్య చేసిన దండుగులు సూట్ కేసులో ఆ బాడీని కుక్కి రోహ్‌తక్-దిల్లీ హైవేపై పడేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు హర్యానా మాజీ సీఎం పట్టుబట్టారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 48 గంటల వ్యవధిలోనే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. పలు కీలక విషయాలు వెల్లడించారు.
నిందితుడు అరెస్టు
హిమానీ నర్వాలు హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో రోహ్ తక్ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే హత్యలో ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు సైతం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమానీతో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయముందా అన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. హిమానీ మృతదేహాం బయటపడ్డ ప్రాంతంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే హిమానీకి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు ఇవ్వాలని అగంతుకులు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది.
సొంతపార్టీ నేతలే చంపారు: హిమానీ తల్లి
తన కుమార్తె హత్యపై హిమానీ నర్వాల్ తల్లి సవిత సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయంగా తన కూతురు ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఆమెను దుండగులు చంపినట్లు ఆరోపించారు. హర్యానా మాజీ సీఎం భూపిందర్ హుడా కుటుంబంతో హిమానీకి సత్సంబంధాలు ఉన్నాయని, అది చూసి తట్టుకోలేక సొంత పార్టీ నేతలే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని ఆమె అన్నారు. 2011లోనూ ఇలాగే తన పెద్ద కుమారుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సవిత తెలిపారు. అప్పుడు కూడా తమ కుటుంబానికి న్యాయం జరగలేదని వాపోయారు.
Also Read: Zelensky: ట్రంప్ విషయంలో జెలెన్ స్కీ యూటర్న్.. ఇంతలో ఎంత మార్పు
హిమానీ పొలిటికల్ ప్రస్థానం
హర్యానాకు చెందిన హిమానీ నర్వాల్.. 22 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పెద్దల దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ హిమానీ పాల్గొంది. ఆ సందర్భంలో రాహుల్ తో హిమానీ దిగిన ఫొటోలు.. హత్యానంతరం పెద్ద ఎత్తున వైరల్ మారాయి. గత నెల ఫిబ్రవరి 28న కాంగ్రెస్ తలపెట్టిన రోడ్ షోలోనూ హిమానీ పాల్గొనాలని భావించింది. అయితే అనూహ్యంగా ఆమె ఆ రోజు నుంచే కనిపించకుండా పోయింది. ఆ మర్నాడే సూట్ కేస్ లో విగతజీవిగా కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ సహా.. కుటుంబ సభ్యులను షాక్ కు గురిచేసింది.