Tiger Dog Fight: విశ్వాసానికి మారు పేరుగా శునకాలను చెబుతుంటారు. ఈ కారణం చేతనే మానవులతో శునకాలకు విడదీయరాని బంధం ఏర్పడింది. అటు శునకాలు సైతం కాలనుగుణంగా తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఇచ్చేస్తున్నాయి. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగింది. యజమానిపై దాడి చేసిన పులితో ఓ శునకం వీరోచితంగా పోరాడింది. తనకంటే ఎంతో బలశాలైన పులికి చుక్కలు చూపించి యజమాని ప్రాణాలను కాపాడుకుంది.
పులితో విరోచిత పోరాటం
మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లా భార్హుట్ గ్రామానికి చెందిన శివమ్ అనే వ్యక్తి జర్మన్ షెపార్డ్ జాతికి చెందిన శునకాన్ని పెంచుకుంటున్నాడు. అతడి గ్రామానికి ఆనుకొని బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. రోజువారీ పనుల్లో భాగంగా శివమ్.. తన శునకాన్ని తీసుకొని తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న పులి.. శివమ్ పై ఒక్కసారిగా దాడి చేసింది. ఇది గమనించిన శునకం.. తన యజమాని ప్రాణాలను కాపాడుకునేందుకు పులిపై ఎదురుదాడికి దిగింది. ఏమాత్రం బెరుకు లేకుండా పులితో విరోచితంగా పోరాడింది. శునకం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పులి అక్కడి నుంచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది.
Also Read: Summer Skin Care: వేసవిలోనూ మీ చర్మం తళతళా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆపై శునకం మృత్యువాత
పులితో ధైర్యంగా పోరాడుతున్న క్రమంలో పెంపుడు శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. పులి పారిపోయిన వెంటనే యజమాని శివమ్ హుటా హుటీనా తన శునకాన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శునకాన్ని రక్షించేందుకు పశువైద్యుడు డాక్టర్ అఖిలేష్ సింగ్ ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కుక్క మెడపై తీవ్ర గాయాలైనట్లు వైద్యుడు అఖిలేష్ తెలిపారు. దాని శరీరంపై పులి పంజా గుర్తులు ఏర్పడ్డాయని అన్నారు. చికిత్స తర్వాత శునకం వెంటనే లేచి నడిచినప్పటికీ గాయాలు లోతుగా ఉండటంతో ప్రాణాలు విడిచినట్లు వైద్యుడు స్పష్టం చేశారు.
కన్నీరు పెట్టిన యజమాని
పులితో పోరాడి తనకు ప్రాణ బిక్ష పెట్టిన పెంపుడు శునకం.. ఇక లేదని తెలిసి యజమాని శివమ్ కన్నీరుమున్నీరయ్యారు. పులి దాడి చేసిన సమయంలో శునకం లేకుంటే తాను ప్రాణాలతో మిగిలేవాడినే కాదని అన్నారు. ఓ దశలో గ్రామం పొలిమేర వరకు శునకాన్ని పులి ఊడ్చుకెళ్లిందని తెలిపారు. అయినా ఏ దశలోనూ జర్మన్ షెపార్డ్ జాతి శునకం వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.