ATM Theft : రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారు జామున ఏటీఎంలోకి చొరబడి ఏకంగా రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు. సినిమా స్టైల్ లో ఏటీఎంలో సొమ్ము చోరీ చేసి హల్ చల్ చేశారు. చాలా ప్రొఫెషనల్ దొంగల్లాగా వారు చేసిన ఈ దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల విలేజ్ లో ఉండే ఎస్బీఐ ఏటీఎంను (Sbi Atm) దొంగలు కొల్లగొట్టారు. ఆదివారం తెల్లవారు జామున నలుగురు దొంగలు కారులో వచ్చారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా స్ప్రే కొట్టారు. ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేసి జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి ఏటీఎం మిషిన్ ను ఓపెన్ చేశారు.
కళ్లు మూసి తెరిచేలోపే అందులో ఉండే సొమ్ము రూ.30 లక్షలను బ్యాగులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే డబ్బులు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు చోరీ జరిగిన ఏటీఎం వద్దకు వచ్చి పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు.